
బటుమి (జార్జియా): ఇండియా చెస్ లెజెండ్ కోనేరు హంపి.. ఫిడే విమెన్స్ వరల్డ్ కప్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి ఇండియన్‌గా రికార్డుకెక్కింది. క్వార్టర్ ఫైనల్లో 1.5–0.5 తేడాతో చైనా ప్లేయర్ సంగ్ యుగ్జిన్‌ను ఓడించి టైటిల్ దిశగా ముందడుగు వేసింది. తొలి గేమ్ నెగ్గి ఒక పాయింట్ అందుకున్న తెలుగమ్మాయి ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ రెండో గేమ్‌ను 53 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. దాంతో ఆమెకు సెమీస్ బెర్తు లభించింది.
ద్రోణవల్లి హారిక.. దివ్య దేశ్‌ముఖ్ రెండో గేమ్ కూడా డ్రా (60 ఎత్తులు) అయింది. చెరో పాయింట్‌తో నిలిచిన ఈ ఇద్దరు సోమవారం టై బ్రేక్స్‌లో తలపడతారు. దాంతో ఇండియాకు మరో సెమీస్ బెర్త్ ఖాయమే. జాంగ్‌యీ (చైనా)తో తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న ఆర్. వైశాలి రెండో పోరులో ఓడి ఇంటిదారి పట్టింది. మరో చైనా ప్లేయర్ లి తింగ్జీ వరుసగా రెండు గేమ్స్‌లో గెలిచి సెమీస్‌లో హంపితో పోరుకు సిద్ధమైంది.