
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించి గెలిపించాలని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కోరారు. కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు గాజులరామారంలోని చిత్తారమ్మ ఆలయంలో పూజలు చేసి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి రిటర్నింగ్ ఆఫీసు వరకు ర్యాలీ తీశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పేపర్లను అందజేశారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో గెలిచినా.. ఓడినా.. జనంలోనే ఉన్నానని తెలిపారు.
ప్రస్తుతం పోటీచేసే అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోతే అమెరికా వెళ్తారని.. మరొకరు బంజారాహిల్స్కే పరిమితమవుతారని సెటైర్ వేశారు. ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి రౌడీలా ప్రవరిస్తున్నాడని ఆరోపించారు. ఓటుతోనే జనం ఆయనకు బుద్ధిచెప్తారన్నారు. తెలంగాణలో అరాచక పాలన పోవాలంటే బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో సుపరిపాలన ఉన్నట్లే తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ వస్తే బీసీ సీఎంతో మంచి పాలన అందిస్తుందని కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు.