కుత్బుల్లాపూర్ పాఠశాలకు ఎమ్మెల్యే వివేక్ చేసిందేమీ లేదు : కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ పాఠశాలకు ఎమ్మెల్యే వివేక్ చేసిందేమీ లేదు : కూన శ్రీశైలం గౌడ్

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు కోటి రూపాయలు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే వివేకానంద ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి బీజేపీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ విలేజ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, ప్రాథమిక పాఠశాలను కూన శ్రీశైలం గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులతో పాటు, మరుగుదొడ్లు, చిన్నపాటి వర్షానికే జలమయమైన పాఠశాల ఆవరణను పరిశీలించారు. విద్యార్థులు సమస్యలను తెలుసుకోవడంతో పాటు మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి తిన్నారు. 

పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు, తరగతి గదులు లేకపోవడం, మధ్యాహ్న భోజనం రుచికరంగా, నాణ్యతగా లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూన శ్రీశైలం గౌడ్. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల అత్యంత అధ్వాన్న స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇరుకు గదుల్లో కూర్చోబెట్టి..  వంద మందికి ఒకే తరగతి గదిలో పాఠాలు చెబుతున్నారని చెప్పారు. వాష్ రూమ్స్ కూడా సరిగా లేవని, ఆట స్థలం కూడా లేదన్నారు. సగం మంది విద్యార్థులకు యూనిఫామ్స్ కూడా రాలేదన్నారు.  

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ 2014లో గెలిచిన100 రోజుల తర్వాత తన జీత భత్యాన్ని ప్రభుత్వ పాఠశాలకు కేటాయిస్తానని చెప్పారని కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. ఎనిమిదేళ్లలో ఎంత మంది విద్యార్థులకు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన తండ్రి పేరిట సొంత డబ్బుతో కోటి రూపాయలతో కుత్బుల్లాపూర్ పాఠశాలను అభివృద్ధి చేస్తానని అసెంబ్లీ చెప్పిన వీడియోను మీడియా ప్రతినిధులకు చూపిస్తూ మండిపడ్డారు కూన శ్రీశైలం గౌడ్. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యే వివేక్ చేసింది శూన్యం అన్నారు. ఎమ్మెల్యే తన సొంత గ్రామంలోని స్కూల్ నే పట్టించుకోవడం లేదని, ఇక నియోజకవర్గాన్ని ఏం ఉద్దరిస్తారంటూ మండిపడ్డారు. పాఠశాలలో సమస్యలను పరిష్కారం చేయకుంటే...జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.