
సువోన్: ఇండియా షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ గాయం కారణంగా కొరియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో ప్రణయ్.. చికో ఆరా ద్వివార్డోయో (ఇండోనేసియా)తో తలపడ్డాడు. అయితే తొలి గేమ్‌లో 5–8 స్కోరుతో ఉన్నప్పుడు క్రాస్ కోర్టు షాట్ ఆడే క్రమంలో ప్రణయ్ కుడి పక్కటెముకలు పట్టేశాయి. మెడికల్ టైమౌట్‌లో చికిత్స తీసుకుని మళ్లీ ఆట కొనసాగించినా కోర్టులో అసౌకర్యంగా కదిలాడు.
చివరకు 8–16 స్కోరు వద్ద మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆయుష్ షెట్టి 18–21, 18–21తో సు లి యాంగ్ (చైనీస్‌తైపీ) చేతిలో, కిరణ్ జార్జ్ 14–21, 22–20, 14–21తో మాజీ వరల్డ్ చాంపియన్ లోహ్ కియాన్ యూ (సింగపూర్) చేతిలో ఓడారు. విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో అనుపమ ఉపాధ్యాయ 16–21, 15–21తో నాలుగోసీడ్ పుత్రి వార్డాని (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మోహిత్ జగ్లాన్–లక్షిత జగ్లాన్ 7–21, 14–21తో యుచి షిమోగామి–సయకా హోబరా (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు.