మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 15వ చిత్రం (VT15) టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను వరుణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. అంతే కాకుండా, సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చిన్న గ్లింప్స్‌తోనే చెప్పకనే చెప్పారు . ఈ చిత్రంతో వరుణ్ తేజ్ తొలిసారిగా హారర్ కామెడీ - ఫాంటసీ జానర్‌లోకి అడుగుపెట్టారు..
కొరియన్ భాషలో వరుణ్ డైలాగ్స్!
లేటెస్ట్ గా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. విదేశాల్లోని ఒక పోలీస్ స్టేషన్ నేపథ్యంలో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. అక్కడ పోలీసులు కమెడియన్ సత్యను చితకబాదుతుండగా, సత్య తనదైన కామెడీ స్టైల్‌లో భయపడిపోవడం నవ్వులు పూయిస్తోంది. అదే సమయంలో.. స్టేషన్ లోకి వచ్చిన వరుణ్ తేజ్ ను చూచి ‘వీడు మన కనకరాజు కాదమ్మీ..’ అని సత్య చెప్పే డైలాగ్‌తో హీరో ఎంట్రీ మొదలవుతుంది. అక్కడ ఉన్న విదేశీ పోలీసులను కొరియన్ భాషలో హెచ్చరిస్తూ, మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో వరుణ్ తేజ్ రంగ ప్రవేశం చేశారు. ‘నేను తిరిగొచ్చేశా’ (I am back) అని కొరియన్ భాషలో ఆయన చెప్పిన కౌంటర్ డైలాగ్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. వరుణ్ లుక్, మేనరిజమ్స్, ఆ కొరియన్ యాస ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
మేర్లపాక గాంధీ మ్యాజిక్..
ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గత చిత్రాల్లో కనిపించే పంచ్ డైలాగులు, టిపికల్ హ్యూమర్ ఈ సినిమాలోనూ పుష్కలంగా ఉన్నాయని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ చిత్రంలో వరుణ్ సరసన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి తులసి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో వరుణ్ - తమన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘తొలిప్రేమ’ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
బలమైన ‘కమ్ బ్యాక్’ దిశగా..
వరుణ్ తేజ్ గత చిత్రాలు ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో వరుణ్ ఉన్నారు. యువీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. హారర్, ఫాంటసీకి కామెడీ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవుతాయని గతంలో ‘అరుంధతి’ లేదా ‘ముంజ్య’ వంటి చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ కూడా అదే దారిలో వెళ్లి వరుణ్ తేజ్‌కు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్ సీజన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
