లక్ష్మీరాజంది సుపారీ హత్యే 

లక్ష్మీరాజంది సుపారీ హత్యే 
  • కేసును సీబీఐకి అప్పగించాలంటూ కోరుట్లలో ముదిరాజ్‌‌ల ర్యాలీ

కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్​ కౌన్సిలర్​ పోగుల ఉమారాణి భర్త లక్ష్మీరాజం హత్య కేసును సీబీఐకి  అప్పగించాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. సోమవారం కోరుట్లలోని అయిలాపూర్ రోడ్డు పెద్దమ్మ దేవాలయం నుంచి కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా కార్గిల్ చౌరస్తా  వరకు భారీ సంఖ్యలో ముదిరాజ్​లు ర్యాలీ నిర్వహించారు. కార్గిల్​ చౌరస్తా వద్ద హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వారు మాట్లాడుతూ లక్ష్మీరాజం హత్య ముమ్మాటికీ  సుపారీ హత్యేనని ఆరోపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్​ చేశారు.

లక్ష్మీరాజం భార్య కౌన్సిలర్ ఉమారాణి మాట్లాడుతూ తన భర్త హత్య వెనక చాలా మంది ఉన్నారని, నిందితులను పట్టుకొని న్యాయం చేయాలన్నారు. తర్వాత కార్గిల్​ చౌరస్తా నుంచి ర్యాలీగా ఆర్డీవో ఆఫీస్​ కు, ఆ తర్వాత పీఎస్​కు చేరుకుని వినతి పత్రం ఇచ్చారు. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుణ జ్యోతి,  ముదిరాజ్ ​సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య , హన్మాండ్లు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుర్రాల మల్లేశం, లీడర్లు నీలం పెద్దలు, నర్సయ్య, అనంతయ్య, పోచయ్య, రాంబాబు, రాజేశ్‌‌, పండగ బాలు, చరణ్, శ్రీనివాస్, అశోక్, కుమార్, భాజన్న  పాల్గొన్నారు.