బ్యాంకింగ్ రంగంలో భద్రతకు మారుపేరుగా నిలిచే ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు ఇప్పుడు వరుస కుంభకోణాలతో ఉలిక్కిపడుతున్నాయి. తాజాగా హర్యానాలోని పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో సుమారు 160 కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగినట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దీనికి ముందు కొద్ది రోజుల కిందట ఐడీఎఫ్సీ బ్యాంక్ లో కూడా ప్రభుత్వ ఖాతాల్లో సొమ్ము మాయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ తన నిధులను కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసింది. వీటిలో ఒక ఎఫ్‌డీ మెచ్యూరిటీ సమయం రావడంతో.. ఆ నిధులను బదిలీ చేయాలని కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కుమార్ బ్యాంకును కోరారు. అయితే రికార్డులను పరిశీలించిన సమయంలో లెక్కల్లో భారీ తేడాలున్నట్లు బ్యాంక్ గుర్తించింది. కార్పొరేషన్ రికార్డుల ప్రకారం ఉండాల్సిన నగదుకు, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదుకు పొంతన లేకపోవడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది.
►ALSO READ | ఒక్కరోజే కేజీకి రూ.15వేలు పెరిగిన వెండి.. ఎందుకీ సడన్ రైజ్?
ఈ వ్యవహారంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ స్పందిస్తూ.. ప్రాథమిక విచారణలో కేవైసీ డాక్యుమెంటేషన్, సంతకాలు అన్నీ సక్రమంగానే ఉన్నాయని తెలిపింది. అయితే ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకోవడానికి రీకన్సీలియేషన్ ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించింది. ఇప్పటికే కొంత మొత్తాన్ని కార్పొరేషన్ ఖాతాతో సరిపోల్చినట్లు, మిగిలిన నిధులపై విచారణ జరుగుతోందని పేర్కొంది. పారదర్శకత కోసం బ్యాంకు స్వయంగా పంచకుల పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది.
వరుసగా హర్యానాలోనే ఎందుకు?
ఈ ఘటనకు కొద్దిరోజుల ముందే చండీగఢ్‌లోని IDFC ఫస్ట్ బ్యాంక్‌లో కూడా ఇలాంటిదే 590 కోట్ల రూపాయల భారీ మోసం వెలుగు చూసింది. హర్యానా ప్రభుత్వానికి చెందిన కొన్ని నిర్దిష్ట ఖాతాల్లో బ్యాంకు ఉద్యోగులే ఈ గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తేలింది. ఇప్పుడు కోటక్ బ్యాంక్‌లో కూడా ప్రభుత్వ నిధులే మాయమవ్వడం బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభుత్వ ఖాతాల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ నిధులను ప్రైవేట్ బ్యాంకుల్లో దాచుకోవడం సురక్షితమేనా? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
