కొత్తగూడెం ఎస్పీకి కాంట్రాక్టర్ కంప్లయింట్

కొత్తగూడెం ఎస్పీకి కాంట్రాక్టర్ కంప్లయింట్
  • పర్సంటేజ్ ఇస్తేనే మార్కింగ్ చేస్తానంటున్నడు
  • ప్రజాప్రతినిధిని కలిసి మాట్లాడాలట
  • ఆరు శాతం కమిషన్ ఇవ్వాల్నట
  • కొత్తగూడెం ఎస్పీకి కాంట్రాక్టర్ కంప్లయింట్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సాక్షాత్తు పోలీస్​ బెటాలియన్​ క్యాంపు గోడ కట్టడానికి కావాల్సిన మార్కింగ్​ చేయడానికి స్థానిక డీఈ పర్సంటేజీ అడుగుతున్నారని ఎస్పీకి కంప్లయింట్​ చేశాడో కాంట్రాక్టర్. ప్రజాప్రతినిధితో మాట్లాడుకొని వచ్చిన తర్వాతే పని చేస్తానంటూ డీఈ చెబుతున్నాడని వాపోయాడు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని చాతకొండ పోలీస్ ​బెటాలియన్ క్యాంపు ప్రహరీగోడ నిర్మాణానికి మూడు నెలల కింద పంచాయతీ రాజ్​అధికారులు టెండర్లు పిలిచారు. రూ. 1.80 కోట్లతో కాంపౌండ్​ వాల్​ నిర్మించడానికి కొండల్​ అనే కాంట్రాక్టర్​ టెండర్​ దక్కించుకున్నాడు. టెండర్​ ఫైనలై మూడు నెలలు గడుస్తున్నా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని ఎస్పీ డాక్టర్​ వినీత్...​కాంట్రాక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన అసలు విషయం బయటపెట్టాడు. డీఈ సత్యనారాయణ పనికి సంబంధించిన మార్కింగ్ ​ఇవ్వలేదని, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధిని కలిసి వచ్చిన తర్వాతే మార్కింగ్​ ఇస్తానంటూ తిప్పించుకుంటున్నాడని వివరించాడు. ఆ ప్రజాప్రతినిధి కుటుంబసభ్యులు ఆరు శాతం కమీషన్​ అడుగుతున్నారని చెప్పాడని, తాను ఇవ్వలేనని చెప్పినప్పటి నుంచి ఏదో ఒక కారణంతో సతాయిస్తున్నాడని వాపోయాడు. ఎవరితోనైనా అడిగిస్తే జంగిల్​ కటింగ్​ చేయలేదని అందుకే మార్కింగ్ ​ఇవ్వడం లేదని చెబుతున్నాడని, సైట్​ చూయించకుండా తాను జంగిల్​ కటింగ్​ ఎలా చేస్తానని ప్రశ్నించాడు. తన టెండర్ ​రద్దు చేసినా బాధ లేదంటూ ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఈ వ్యవహారాన్ని ఎస్పీ..కలెక్టర్ ​దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.  

అందుకే మార్కింగ్​ చేయలే...
తాను ఎటువంటి కమీషన్​ అడగలేదని డీఈ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ప్రజాప్రతినిధిని కానీ, వారి కుటుంబసభ్యులను కలవాలని తాను ఎందుకు చెబుతానని అన్నారు. కాంట్రాక్టర్ ​జంగిల్​కటింగ్​ చేయకుండా ఆలస్యం చేశాడని అందుకే మార్కింగ్​ ఇవ్వలేదన్నారు. జంగిల్​ కటింగ్​ రెండు రోజుల కిందే పూర్తయ్యిందని, మార్కింగ్​ ఇస్తానని కాంట్రాక్టర్​కు చెప్పానన్నారు. అయినా కాంట్రాక్టర్​ కావాలని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.