కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు ..తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం

కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి  మన్మోహన్ సింగ్ పేరు ..తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం
  • సీఎం రేవంత్​ రెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు
  • పెరుగనున్న ఉద్యోగ అవకాశాలు 
  • ఆనందంలో ఉమ్మడి ఖమ్మం జిల్లావాసులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  జిల్లాలోని పాల్వంచలోని కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్​పేరుతో ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సీఎం తోపాటు మంత్రి వర్గానికి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. 

దేశానికే తలమానికంగా.. 

జిల్లాలోని పాల్వంచలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశానికే తలమానికం కానున్నది. సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్ లోనే ఈ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే బీఎస్సీ జియాలజీ, బీఎస్సీ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ కోర్సులు ప్రారంభమయ్యాయి. 

ఒక్కో కోర్సులో 60సీట్లను కేటాయించినప్పటికీ కోర్సులు ఆలస్యంగా శాంక్షన్ కావడంతో అడ్మిషన్స్ తక్కువగా జరిగాయి. జియాలజీ కోర్సులో 14 మంది, ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ కోర్సులో 37 మంది జాయిన్ అయ్యారు. భవిష్యత్​లో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెటరీ జియాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, పర్యావరణ భూగర్భ శాస్త్రం లాంటి పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. 

అపారమైన వనరులు... 

జిల్లాలో అపారమైన ఖనిజ, నీటి, అటవీ వనరులున్నాయి. కిన్నెరసాని అభయారణ్యంతో పాటు దట్టమైన అడవులున్నాయి. సింగరేణి కాలరీస్ మైన్స్, కేటీపీఎస్, నవభారత్, బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్ లాంటి పరిశ్రమలున్నాయి. గోదావరితో పాటు కిన్నెరసాని నదులున్నాయి. పరిశోధనలకు ఈ వనరులు స్టూడెంట్స్​కు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. 

ఉపాధి అవకాశాలు.. 

యూనివర్సిటీలో జిల్లాకు చెందిన స్టూడెంట్స్​కు కొత్త అవకాశాలు రానున్నాయి. యూనివర్సిటీలో చేరి కోర్సులు పూర్తి చేసిన అనంతరం పరిశోధన, పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో సంబరాలు

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. ప్రజలు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ప్రజా ప్రతినిధులు విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ పేరు  పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతోపాటు విద్యార్థి సంఘాలు, ప్రజాసంస్థలు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 

మంత్రి తుమ్మల విశేష కృషి..

ఎర్త్ సైన్సెస్ కళాశాలను డాక్టర్​ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఏర్పాటు చేయడంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చడంలోనూ, మన్మోహన్ సింగ్ పేరు ఖరారు చేయడంలోనూ ఆయన విశేష కృషి చేశారు. ‘రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ విద్యా రంగానికి కొత్త దిశను చూపుతుంది’  అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులకు మంచి అవకాశాలు ఏర్పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.