తొలి మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజ్

V6 Velugu Posted on Jan 18, 2022

హైదరాబాద్: వందేళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతున్న కోఠి మహిళా కళాశాలను రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా తీర్చిదిద్దే అంశంపై తన కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజ్.. యూజీసీ అటానమస్తో పాటు న్యాక్ గుర్తింపు కలిగి ఉంది. యూనివర్సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నందునే ప్రభుత్వం విశ్వవిద్యాలయంగా మార్చాలని భావిస్తోందని మంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీ మారిస్తే అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థులకు వసతులు, మౌళిక సదుపాయాలు తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలలో 4,159మంది విద్యార్థినులు చదువుతుండగా.. మహిళా యూనివర్సిటీగా మారిస్తే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మహిళా విశ్వవిద్యాలయంలో ఆధునిక కోర్సులు బోధించేలా కోర్సులను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

 

Tagged Hyderabad, Sabitha Indra Reddy, koti womens college, womens university

Latest Videos

Subscribe Now

More News