కృష్ణా నదికి భారీ వరద హెచ్చరిక..గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి

కృష్ణా నదికి భారీ వరద హెచ్చరిక..గంట గంటకూ పెరుగుతున్న వరద ఉధృతి

ప్రజలు, ఇరిగేషన్ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న అధికారులు

శ్రీశైలం వద్ద 6 లక్షల క్యూసెక్కులకు చేరిన వరద ప్రవాహం

ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షలకుపైబడిన వరద

రాత్రిలోగా వరద పోటు మరింత పెరిగే అవకాశం

నదీ తీర ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి..

ఎట్టి పరిస్థితుల్లో వాగులు.. నది దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిక

ఎగువ నుండి వస్తున్న వరద ప్రవాహానికి తోడు.. భారీ వర్షాలతో కృష్ణా నది వరద నీటితో పోటెత్తిపోతోంది. అంచనాలకు మించి ఊహించని రీతిలో భారీ వరద వస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాం ల నుండి వరద ప్రవాహం పెరుగుతుండడానికి తోడు.. తెలుగు రాష్ట్రాల పరిధిలో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తుతూ ప్రమాదకరంగా మారుతోంది. ఆల్మట్టి నుండి వస్తున్న నీటి కంటే ఎక్కువ వరద నారాయణపూర్ నుండి జూరాలకు చేరుకుంటోంది. అలాగే జూరాల నుండి విడుదల చేస్తున్న నీటికి తోడు.. తుంగభద్ర నీరు కూడా తోడవుతుండడంతో శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. 

శ్రీశైలం వద్ద ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్న కృష్ణా నది.. ప్రకాశం బ్యారేజ్ కి వెళ్లే సరికి మరో లక్షన్నర క్యూసెక్కులు పెరిగింది. సుమారు 7.5  లక్షల క్యూసెక్కులకు చేరుకుంటోంది. వరద ఉద్ధృతి 9 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ కలెక్టర్ ఇంతియాజ్ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. మరీ ముఖ్యంగా కృష్ణా నదీతీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరికీ తెలిసేలా మీడియా ద్వారా.. దండోరా.. టామ్ టామ్ లతోపాటు… మైకుల్లో కూడా నది పక్కన తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజ్ కి మధ్యాహ్నం సమయానికి ఏడున్నర లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంటే, మొత్తం నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.

శ్రీశైలం నుండి వస్తున్న నీటికి తోడు.. పులిచింతల ప్రాజెక్టు మరో లక్ష  క్యూసెక్కులకు పైబడిన నీరు వచ్చి చేరుతోంది. అది క్రమేణ పెరిగే అవకాశం ఉందన్నారు.  ఈ వరద నీరు విడుదల చేస్తే లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. జగ్గయ్యపేట నుండి నదీ పరీవాహక ప్రాంతాల్లోని 18 మండలాల అధికారులందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి… పల్లెల్లో టాం టాం వేయించడం, మైకుల్లో చెప్పించడం.. సోషల్ మీడియా ద్వారా కూడా  ప్రజలను అత్యవసరంగా అప్రమత్తం చేయాలని సూచనలిచ్చారు. ఎక్కడిక్కడి ప్రజలందరికీ ఈ సమాచారం చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. నదికి సమీపంలో ఉండటం అతి ప్రమాదకరం. వెంటనే పునరావస కేంద్రాలకు బాధితులందరినీ తరలించాలన్నారు. ప్రజలు వాగులు, వంకలు, కాల్వలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.