- 14న నిర్వహించాలన్న తెలంగాణ విజ్ఞప్తికి నో
- ఏపీ కోరినట్లు నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మీటింగ్ తేదీని మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని బోర్డు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన తేదీకే బోర్డు మొగ్గు చూపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన మీటింగ్‌ను మధ్యాహ్నం 3:30 గంటలకు రీషెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి 13 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు కావాలని తెలంగాణ లేఖ రాయగా, తమకు 10 టీఎంసీలు కావాలని ఏపీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్రీసభ్య కమిటీ మీటింగ్ కు అనువైన సమయం చెప్పాలని రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు కోరింది.
12న నిర్వహించాలని ఏపీ రిప్లై ఇవ్వగా.. 14న నిర్వహించనున్న 21వ బోర్డు సమావేశంలోనే చర్చించాలని తెలంగాణ చెప్పింది. సోమవారం కూడా మరోమారు లేఖ రాసినా, బోర్డు మాత్రం ఏపీ కోరిన మేరకే మీటింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. తాగునీటి పేరుతో ఏపీ ఆడుతున్న డ్రామాలకు బోర్డు వంత పాడుతోందని నీటిపారుదల శాఖ వర్గాలు మండిపడుతున్నాయి. సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై తెలంగాణ అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, ప్రస్తుత సమాచారం ప్రకారం ఈఎన్‌సీ ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
