పోటీ నుంచి తప్పుకున్న ప్రస్తుత చైర్మన్​ కృష్ణారెడ్డి

పోటీ నుంచి తప్పుకున్న ప్రస్తుత చైర్మన్​ కృష్ణారెడ్డి

ఈ నెల 27న హయత్​ నగర్​లో ఎన్నికలు

నల్గొండ, వెలుగు: మదర్ ​డెయిరీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడు డైరెక్టర్ల స్థానాలకు 14 మంది నామినేషన్లు వేయగా, 9 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. శుక్రవారం నామినేషన్​ల విత్​డ్రా గడువు ముగిసేసరికి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హన్మంతరావు ప్రకటించారు. పోటీ నుంచి తప్పుకున్న వాళ్లలో ప్రస్తుత చైర్మన్​ గంగుల కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. రెండోసారి చైర్మన్​గా కొనసాగేందుకు కృష్ణారెడ్డి చివరినిమిషం వరకు ప్రయత్నించారు. మంత్రి జగదీశ్​రెడ్డిని కలిసి ఇంకోసారి చాన్స్​ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కానీ స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒప్పుకోకపోవడంతో డైరెక్టర్ ​పోటీ నుంచి తప్పుకోవడం అనివార్యమైంది. కృష్ణారెడ్డి ప్లేస్​లో నకిరేకల్​ నియోజకవర్గంలోని నిదాన్​పల్లి సొసైటీ నుంచి మందడి ప్రభాకర్​ రెడ్డికి అవకాశం కల్పించారు. భువనగిరి డైరెక్టర్​ స్థానానికి కస్తూరి పాండును ఫైనల్​ చేశారు. ఆలేరు డైరెక్టర్​ స్థానం కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్​ నుంచి గొల్లపల్లి రాంరెడ్డి, కాంగ్రెస్, బీజేపీల నుంచి బత్తుల నరేందర్​రెడ్డి, ఎన్. వెంకటనర్సింహారెడ్డి బరిలో ఉన్నారు. ఈ నెల 27న హయత్​నగర్​లో ఎస్​వీఎస్​ ఫంక్షన్​ హాల్​లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 278 సంఘాలు ఓటు హక్కు కలిగి ఉన్నాయి. ఉ దయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్​ నిర్వహించి  మధ్యాహ్నం జనరల్​బాడీ మీటింగ్ పెట్టి ఫలితాలు వెల్లడిస్తారు. అన్నీ కుదిరితే అదే రోజు సాయంత్రం చైర్మన్​ ఎన్నిక కూడా పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు. 

ఫలించిన మహేందర్​ రెడ్డి వ్యూహం

డెయిరీ ఎన్నికలు అనివార్యమే అయినప్పటికీ చైర్మన్​పదవి గొంగడి మహేందర్​రెడ్డి వర్గీయులకే ఇవ్వాలని పార్టీ డిసైడ్​ చేసింది. ఆలేరు నుంచి ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ డైరెక్టర్​ శ్రీకర్​రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 278 సంఘాల్లో 150 ఆలేరు నియోజకవర్గంలోనే ఉన్నాయి. దీంతో చైర్మన్​ పదవి ఎట్టిపరిస్థితుల్లో తమకే కావాలని మహేందర్​రెడ్డి ఎప్పటినుంచో పట్టుబడుతున్నారు. ఈ ఎన్నికల్లో డెయిరీ చైర్మన్​ పదవి దక్కించుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా ఆలేరులో ప్రయోజనం చేకూరుతుందని మహేందర్​రెడ్డి వర్గం భావిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో కీలకమైన పదవుల్లో ఆలేరు నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఎమ్మెల్యే సునీతకు ప్రభుత్వ విప్ ఇవ్వగా ఆమె భర్త మహేందర్​రెడ్డి డీసీసీబీ చైర్మన్​గా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డెయిరీ చైర్మన్​ పదవి కూడా దక్కే అవకాశం ఉంది.