
హైదరాబాద్, వెలుగు:
కృష్ణా నదిలో వరద పోటెత్తి, ప్రవాహం దిగువకు వెళ్లిపోతున్నప్పుడు ఇరు రాష్ట్రాలు వాడుకునే నీటిని వాటా కింద పరిగణించాలా, వద్దా అన్న అంశంపై సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. ఈ అంశంలో ఏపీ చేసిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా ప్రకటించారు. సబ్ కమిటీ మే నెలాఖరు విషయం తేల్చుతుందని, ఇప్పటికైతే 66 : 34 నిష్పత్తిలోనే నీటి పంపకాలకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు 11వ మీటింగ్ జరిగింది. వరద రోజుల్లో ఏపీ 132 టీఎంసీల నీటిని తరలించుకుపోగా, తెలంగాణ 39 టీఎంసీలు తీసుకున్నట్టుగా మీటింగ్‌లో అధికారులు వెల్లడించారు.
తెలంగాణకు 140 , ఏపీకి 84 టీఎంసీలు..
మే నెలాఖరు వరకు వాడుకునేలా.. తెలంగాణకు 140 టీఎంసీలు, ఏపీకి 84 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు త్రీమెన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. బోర్డు జనరల్ బాడీ మీటింగ్ తర్వాత చైర్మన్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీల కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. డిసెంబర్ 31 నాటికి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో డెడ్ లెవల్‌కు ఎగున 233.61 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉండగా.. అందులోంచి 224 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకు కేటాయించింది. 157 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ, 98 టీఎంసీలు కావాలని ఏపీ ఇండెంట్లు సమర్పించాయి.
లెక్క మేరకే నీళ్లు..
డిసెంబర్ 31 వరకు కృష్ణా బేసిన్‌లో ఏపీ 511 టీఎంసీలు ఉపయోగించుకోగా, తెలంగాణ 158 టీఎంసీలు వాడుకుంది. వాటర్ ఇయర్ ముగిసే మే 31 నాటికి 66 : 34 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలకు నీళ్లు అందాలి. ఆ లెక్కనే ప్రస్తుతం నీటి కేటాయింపులు చేశామని బోర్డు మెంబర్ సెక్రెటరీ పరమేశం మీడియాకు తెలిపారు. తెలంగాణ కేటాయింపుల్లో శ్రీశైలం నుంచి కల్వకుర్తికి 20 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి ఏఎమ్మార్పీ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, మిషన్ భగీరథకు 45 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువకు 75 టీఎంసీలు ఇచ్చారు. ఇక ఏపీకి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీంకు 4 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతికి 18 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి కుడి కాల్వకు 42 టీఎంసీలు, ఎడమ కాలువకు 20 టీఎంసీలు కేటాయించారు.
క్రాస్ వాల్స్ తొలగింపునకు నో
నాగార్జునసాగర్ ఎడమ కాల్వపై నిర్మించిన క్రాస్ వాల్స్ ను తొలగించాలంటూ ఏపీ చేసిన ప్రతిపాదనను తెలంగాణ తోసిపుచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ కమిటీ సూచనల మేరకే క్రాస్ వాల్స్ నిర్మించారని రాష్ట్ర అధికారులు గుర్తు చేశారు. ఎడమ కాల్వలో కేటాయింపులకు మించి ఏపీ నీటిని తీసుకుందని, అలాంటప్పుడు వాటితో ఉన్న ఇబ్బందేమిటని ప్రశ్నించారు. ఈ వాదనను బోర్డు సమర్థించింది. ఇక కృష్ణా బోర్డు హెడ్ క్వార్టర్స్‌ను ఏపీకి షిఫ్ట్ చేయాలని ఆ రాష్ట్ర అధికారులు కోరగా సీఎస్ సోమేశ్‌కుమార్ అంగీకరించలేదు. ఏపీ రాజధానిపై స్పష్టత లేనందున బోర్డు హెడ్ క్వార్టర్స్‌ను ఎక్కడ పెట్టాలన్న విషయంలో ఇప్పుడు చర్చ వద్దని బోర్డు చైర్మన్ సూచించడంతో దీనిపై చర్చకు తెరపడినట్టు తెలిసింది.