కేఆర్ఎంబీ ఖజానా ఖాళీ .. ఈ నెల జీతాలిచ్చేందుకూ పైసల్లేవ్

కేఆర్ఎంబీ ఖజానా ఖాళీ .. ఈ నెల జీతాలిచ్చేందుకూ పైసల్లేవ్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్​మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) ఖజానా ఖాళీ అయ్యింది. బోర్డు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, సిబ్బందికి జీతాలివ్వడానికి కూడా పైసల్లేవు. ఏపీ రీఆర్గనైజేషన్​యాక్ట్​ప్రకారం ఏర్పడిన కేఆర్ఎంబీకి తెలంగాణ, ఏపీ సమానంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. నిధుల విడుదలపై రెండు రాష్ట్రాలు పట్టింపులేనట్టుగా వ్యవహరించడంతో ఇప్పుడు బోర్డు నిర్వహణ ప్రమాదంలో పడింది. సిబ్బందికి డిసెంబర్​నెల జీతాలు కూడా ఇవ్వడానికి డబ్బులు లేకపోవడంతో వెంటనే నిధులు విడుదల చేయాలని బోర్డు నిర్వాహకులు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. ఏదైనా రాష్ట్రం నిధులిస్తే తప్పా బోర్డులో పని చేస్తున్న వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 

కేఆర్ఎంబీలో రూ.44.63 కోట్ల నిధులు ఉండగా నవంబర్​8 నాటికి రూ.44.35 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన బోర్డులో రూ.28 లక్షలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ ఏడాది బోర్డుకు రూ.23.50 కోట్ల బడ్జెట్​ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలపగా.. ఏపీ రూ.3.35 కోట్లు రిలీజ్​చేసింది. నిరుడు రూ.22.32 కోట్ల బడ్జెట్​కు అప్రూవల్​తెలిపినా రెండు రాష్ట్రాలు పైసా ఇవ్వలేదు. దీంతో బోర్డు ఖజానా ఖాళీ అయ్యింది. కేఆర్ఎంబీ హెడ్​ఆఫీస్​ను జలసౌధలో తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేశామని చెప్తూ మొదటి నాలుగేళ్లు నిధులు ఇచ్చేందుకు తెలంగాణ నిరాకరించింది. ఆ తర్వాతి ఏడాది నుంచి నిధులు విడుదల చేస్తోంది. బోర్డు ఏర్పడిన నాటి నుంచి రెండు రాష్ట్రాలు తలా రూ.67.40 కోట్ల చొప్పున రూ.134.80 కోట్లు ఇస్తామని బోర్డు సమావేశాల్లో అప్రూవల్​ఇచ్చాయి. ఇప్పటి వరకు ఏపీ రూ.24.91 కోట్లు, తెలంగాణ రూ.19.71 కోట్లు రిలీజ్​చేశాయి. తాము ఇస్తామని చెప్పిన నిధుల్లో ఏ రాష్ట్రం కూడా మూడో వంతు ఫండ్స్​రిలీజ్ చేయలేదు. 

బోర్డు నిర్వహణకు నిధులివ్వాలని ప్రతి సమావేశంలో కోరాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాల్లో బోర్డుకు నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల చీఫ్​సెక్రటరీలకు లేఖలు రాయాల్సి వచ్చింది. ఒకట్రెండు రోజుల్లోగా ఏ రాష్ట్రం ఫండ్స్​రిలీజ్​చేయకుంటే మళ్లీ కేంద్రమే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాలు సరిపడా నిధులు ఇవ్వకపోవడంతోనే కృష్ణా నీటి వినియోగాన్ని నిర్ధారించే రెండో దశ టెలీ మెట్రీ స్టేషన్​లు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రతి వివాదంపై బోర్డును ఆశ్రయించే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు.. నిధుల విడుదల మాత్రం తమ బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని బోర్డు నిర్వాహకులు అంటున్నారు.