
హైదరాబాద్, వెలుగు: ఏపీ ఎంత నీళ్లు అడిగితే అంత నీళ్లు కృష్ణా బోర్డు కేటాయించింది. తెలంగాణకు మాత్రం భారీ కోత పెట్టింది. పులిచింతలలో పుష్కలంగా నీళ్లున్నా కృష్ణా డెల్టా స్కీం(కేడీఎస్)కు నాగార్జునసాగర్ నుంచి 15 టీఎంసీలను కేటాయించింది. సెప్టెంబర్ వరకు 152 టీఎంసీలు కావాలని ఏపీ ఇండెంట్పెట్టగా.. అంతకు ఓకే చెప్తూ శుక్రవారం బోర్డు రిలీజ్ ఆర్డర్‌ను జారీ చేసింది. నవంబర్ వరకు 103 టీఎంసీల నీళ్లు కావాలని తెలంగాణ ఇండెంట్ పెట్టగా.. కేవలం సెప్టెంబర్ వరకు అదీ 59.01 టీఎంసీలనే కేటాయించింది. 66:34 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేస్తే ఏపీకి 110 టీఎంసీలు మాత్రమే దక్కాలి. కానీ కృష్ణా బోర్డు అదనంగా మరో 42 టీఎంసీల నీళ్లను ఏపీకి కేటాయించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఈ నెల 13 నాటికి ఎండీడీఎల్‌కు ఎగువన 257.54 టీఎంసీల నీళ్లుండగా సెప్టెంబర్ వరకే 211.01 టీఎంసీల నీటిని తరలించేందుకు బోర్డు ఓకే చెప్పింది. ఈ నీటి కేటాయింపులు ఈ యేడాది వాటర్ ఇయర్ జూన్ ఒకటి నుంచి వర్తిస్తాయని తెలిపింది. నీటి తరలింపు పాయింట్ల నుంచి ఎంతమేరకు డిశ్చార్జి ఉందో లెక్కలు వేస్తామని పేర్కొంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి ఏపీకి తరలించే నీటి నష్టాలు తగ్గించేందుకు ప్రయత్నించాలని సూచించింది. శ్రీశైలం, సాగర్ నుంచి తరలించే నీటిని పవర్ హౌస్‌ల ద్వారా విడుదల చేయాలని తెలిపింది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు రెండు రాష్ట్రాల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని, ఎంత నీటిని రిలీజ్ చేస్తున్నారో తమకు నివేదించాలని బోర్డు స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాలు అంగీకరించిన నీటి పంపిణీ నిష్పత్తి మేరకే నీళ్లు విడుదల చేసేలా చూస్తామని పేర్కొంది. ఏపీకి ప్రస్తుత ఇండెంట్ మేరకు నీటిని కేటాయించినందున భవిష్యత్‌లో చేసే కేటాయింపుల్లో ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించింది. విభజన చట్టం -2014, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్స్ మినిట్స్‌కు లోబడే నీటి కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే.. మే వరకు సాగు, తాగునీటి అవసరాలను లెక్కలోకి తీసుకోకుండా బోర్డు ఏకపక్షంగా వ్యవహరించిందని, తెలంగాణ విషయంలో వివక్ష చూపిందని తెలంగాణ ఇంజనీర్లు అంటున్నారు.
66:34 నిష్పత్తికి అంగీకరించి..!
కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఈ నెల 9న జలసౌధలో భేటీ అయింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 66:34 నిష్పత్తిలో నీటిని పంచుకునేందుకు అంగీకరించాయి. అదే రోజు ఏపీ ఆగస్టు నెలకు 33 టీఎంసీల నీళ్లు కావాలని కోరగా, తెలంగాణ నవంబర్ వరకు 103 టీఎంసీలు కావాలని ఇండెంట్ సమర్పించాయి. ఈ నెల 14న తెలంగాణ మరోసారి కృష్ణా బోర్డును కలిసి నవంబర్ వరకు 103 టీఎంసీలు ఇవ్వాల్సిందేనని ఇండెంట్‌ను అందజేసింది. ఈ నెల 26న ఏపీ మరోసారి కృష్ణా బోర్డును కలిసి సెప్టెంబర్ వరకు 152 టీఎంసీలు కోవాలని కోరింది. వాటిని పరిశీలించిన బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం శుక్రవారం రిలీడ్ ఆర్డర్ జారీ చేశారు. ఏపీకి కోరినట్లుగానే సెప్టెంబర్ వరకు 152 టీఎంసీలు కేటాయిచి.. తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ వరకు 59.01 టీఎంసీలనే కేటాయించారు.
లెక్కలు సరిచేయని ఏపీ
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎక్కువ నీటిని తరలిస్తూ తక్కువ నీటిని చూపుతోందని తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయగా, బోర్డు పరిశీలనలో అది నిజమేనని తేలింది. ఏపీ నీటి దోపిడీకి పాల్పడిందని, పోతిరెడ్డిపాడు నుంచి తరలించిన అసలు నీటి లెక్కలు చెప్తూ రికార్డులు సరిచేయాలని బోర్డు చైర్మన్ ఏపీ ఈఎన్సీకి ఇటీవల లేఖ రాశారు. అయినా ఇప్పటి వరకు ఏపీ అధికారులు రికార్డులు సరిచేయలేదు. ఈ నెల 13 నాటికి పోతిరెడ్డిపాడు నుంచి 12.24 టీఎంసీలనే వాడుకున్నామని ఏపీ నివేదించింది. ఈ నెల 13 వరకు ఏపీ అధికారులు పోతిరెడ్డిపాడు నుంచి 17 టీఎంసీల నీటిని తరలించుకుపోయినట్లు తెలంగాణ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు.
పులిచింతలలో ఉన్నా..
ఈ యేడు కృష్ణాలో వరదలు పోటెత్తడంతో పులిచింతల పూర్తిగా నిండగా.. ప్రాజెక్టులో 45.77 టీఎంసీలకు గాను శుక్రవారం సాయంత్రానికి 43.11 టీఎంసీల నీళ్లున్నాయి. అయినా బోర్డు కృష్ణా డెల్టా స్కీము(కేడీఎస్)కు నాగార్జున సాగర్ నుంచి 15 టీఎంసీలు కేటాయించింది. పులిచింతలలో అందుబాటులో ఉన్న నీటిని కృష్టా డెల్టా స్కీముకు విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేటాయింపులకు ముందే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఇష్టారాజ్యంగా నీటిని తీసుకుపోతున్నా చోద్యం చూస్తున్న బోర్డు రేపు కేడీఎస్‌కు కేటాయించిన 15 టీఎంసీలను ఇతర మార్గాల్లో తరలించినా స్పందిస్తుందన్న గ్యారెంటీ లేదని తెలంగాణ ఇంజనీర్లు అంటున్నారు.