జగిత్యాల జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. కొండగట్టులో పూజా కార్యక్రమానికి బయల్దేరిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్ లోని కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. తృటిలో ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది. పూడూర్ మండువ దగ్గర ఉన్న బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కొండగట్టు పూజలకు వెళ్తున్న ఎమ్మెల్యే కారు బ్రిడ్జ్‌ను దాటిన కొద్ది సేపటికే, వెనుక వస్తున్న కాన్వాయ్ వాహనాల్లో ఒకటి జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు అదుపుతప్పి పల్టీ కొట్టగా వెనుక వస్తున్న మరొక కాన్వాయ్ కూడా ఆ కారును ఢీకొట్టింది. మొత్తం నాలుగు కార్లు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. అన్ని కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి ఓపెన్ కావడం వల్ల ఎవరికి ప్రాణాపాయం సంభవించలేదు.
ఎమ్మెల్యే సత్యం సురక్షితంగా బయటపడ్డారు. కార్లలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పించుకోవడం పట్ల స్థానికులు, ప్రజా ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
