షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో వేధింపులు..అరుణాచల్ చైనాదే అంటూ భారత మహిళపై 18 గంటలు అరాచకం..

షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో వేధింపులు..అరుణాచల్ చైనాదే అంటూ భారత మహిళపై 18 గంటలు అరాచకం..

లండన్‌ నుంచి జపాన్‌కు ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన బ్రిటన్‌ నివాసి పీమా వాంగ్‌జోం థాంగ్డోక్‌కి షాంఘై పుడాంగ్‌ విమానాశ్రయంలో ఆశ్చర్యకర పరిస్థితి ఎదురైంది. నవంబర్‌ 21న 3 గంటల లేయోవర్‌ కోసం విమానాశ్రయంలో దిగిన ఆమెను చైనా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు గంటల తరబడి ప్రశ్నలు వేస్తూ హింసించారు. కారణం ఆమె పాస్‌పోర్టులో పుట్టిన ప్రదేశం అరుణాచల్‌ ప్రదేశ్‌ అని ఉండటమే.

సెక్యూరిటీ చెక్‌ పూర్తి చేసి వేచుంటే ఒక అధికారి తనను పేరుతో పాటు ‘ఇండియా, ఇండియా’ అని అరిచి నన్ను పిలిపించిందని థాంగ్డోక్‌ వెల్లడించారు. తర్వాత ఇమ్మిగ్రేషన్‌ డెస్క్‌ వద్దకు తీసుకువెళ్లి ‘అరుణాచల్‌ చైనాకి చెందిన ప్రాంతం. నీ ఇండియన్ పాస్‌పోర్టు చెల్లదు అని వాదించినట్లు ఆమె చెప్పారు. అధికారులు ఆమె ప్రశ్నలకు ఎటువంటి స్పష్టమైన సమాధానము ఇవ్వకుండా చైనా పాస్‌పోర్టు తీసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పారు. 

వాస్తవానికి 3గంటల విరామం కోసం ఆగితే దాదాపు 18 గంటలు ఇబ్బంది పెట్టడం ఆందోళనకు గురి చేసిందన్నారు. ఆ సమయంలో తనను విమానాశ్రయంలో ఎక్కడికీ వెళ్లనీయలేదని, తినడానికి సరైన ఆహారం కూడా ఇవ్వలేదని చెప్పారు. పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని తన జపాన్‌ ప్రయాణాన్ని కూడా అడ్డుకున్నారని చెప్పారు థాంగ్డోక్‌. ఈ సమయంలోనే తనను చైనా ఈస్టెర్న్‌ ఎయిర్‌లైన్స్‌లో కొత్త టికెట్‌ కొనాలని ఒత్తిడి చేసినట్లు ఆమె వెల్లడించారు. 

Also Read:- టెక్కీని గుల్లగుల్ల చేసిన రోడ్డుపక్క మూలికలమ్మే బ్యాచ్.. సెక్సువల్ సమస్యకు వెళితే కిడ్నీ డ్యామేజ్

దీంతో తాను వెంటనే లండన్‌లోని స్నేహితుడి సహాయంతో షాంఘైలోని భారత కాన్సులేట్‌ను సంప్రదించినట్లు ఆమె చెప్పారు. భారత అధికారులు జోక్యం చేసుకున్నాకే పాస్‌పోర్టు తిరిగి ఇచ్చి, రాత్రివేళ మరో విమానంలో తనను జపాన్ పంపటానికి చైనా అధికారులు అంగీకరించారని వెల్లడించారు. దీంతో ఆమె భారత ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రిత్వశాఖకు తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి వివరంగా లేఖ పంపారు థాంగ్డోక్‌. ఈ అవమానం భారత సార్వభౌమత్వంపై నేరుగా చేసిన దాడిగా ఆమె అభివర్ణించారు. ఇమ్మిగ్రేషన్‌, ఎయిర్‌లైన్‌ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు జరిగిన నష్టానికి పరిహారం అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌ పౌరులుగా ఉన్న భారతీయులకు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చైనా అధికారులతో చర్చలు జరిపి స్పష్టత సాధించటానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని థాంగ్డోక్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటన భారత్-చైనా మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.