టెక్కీని గుల్లగుల్ల చేసిన రోడ్డుపక్క మూలికలమ్మే బ్యాచ్.. సెక్సువల్ సమస్యకు వెళితే కిడ్నీ డ్యామేజ్

టెక్కీని గుల్లగుల్ల చేసిన రోడ్డుపక్క మూలికలమ్మే బ్యాచ్.. సెక్సువల్ సమస్యకు వెళితే కిడ్నీ డ్యామేజ్

బెంగళూరు నగరంలోని జ్ఞానభారతి ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ రోడ్డు పక్కన మూలికలు అమ్ముకునే వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయాడు. కొంత కాలంగా సెక్సువల్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఒకరోజు ఆసుపత్రికి వెళుతూ రోడ్డు పక్కన టెంట్ వేసుకుని అన్ని అనారోగ్యాలకూ ఆయుర్వేద వైద్యం అందిస్తానంటూ కనిపించిన బోర్డు చూసి మాయగాళ్ల వలలో పడ్డాడు. దీంతో నిందితులు అతడి నుంచి ఏకంగా రూ.48 లక్షలు లాగేశారు. 

శివమొగ్గ జిల్లాకు చెందిన బాధితుడు 3 సంవత్సరాలుగా ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2023 మార్చిలో వివాహం అనంతరం కొద్ది నెలల్లో వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు రావడంతో.. కేం‍గేరి లోని ఒక మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించాడు. అలా ఒకరోజు ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి వెళుతున్న సమయంలో “సెక్సువల్ ప్రాబ్లమ్స్ కి తక్షణ పరిష్కారం” అని బోర్డు పెట్టిన ఒక ఆయుర్వేద టెంట్ గమనించాడు. ఆసక్తితో వెళ్లగా.. అక్కడ ఉన్న వ్యక్తి “విజయ్ గురూజీ” అనే వైద్యుడిని పరిచయం చేశాడు. సదరు గురూజీ అతనికి ‘దేవరాజ్ బూటీ’ అనే అరుదైన ఔషధం మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం అంటూ నమ్మించాడు. ఈ ఔషధం యశ్వంత్ పూర్ లో ఉన్న విజయలక్ష్మీ ఆయుర్వేద మెడిసిన్ షాప్‌లో మాత్రమే లభిస్తుందని.. ఒక్క గ్రాము రూ.1.6 లక్షలు విలువైనదిగా పేర్కొన్నాడు. 

విజయ్ సూచనలపై బాధితుడు ఆ దుకాణం నుంచి లక్షల రూపాయల విలువైన ఔషధాలు, అలాగే రూ.76 వేల రూపాయల విలువ గల ‘భావనా బూటీ తైల’ అనే నూనె కొనుగోలు చేశాడు. మొత్తం రూ.17 లక్షలు చెల్లించిన తరువాత విజయ్ మరింత ఔషధం కొనాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు తన కుటుంబం, స్నేహితుల నుంచే కాకుండా బ్యాంక్ లోన్ తీసుకుని మరీ వారు చెప్పిన ఔషధాలు కొన్నాడు. దీంతో చివరికి రూ.48 లక్షలు మోసపోయాడు.

ALSO READ : ఢిల్లీ పొల్యూషన్ పై నిరసన జనాన్ని ఇలా అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితులు సూచించిన ఔషధాలు ఉపయోగించినప్పటికీ ఆరోగ్యంలో మార్పు లేకపోగా.. మరింతగా క్షీణించింది. దీంతో కొత్తగా నిర్వహించిన వైద్య పరిక్షలో కిడ్నీ డ్యామేజ్ అవుతున్నట్లు బయటపడింది. దీంతో సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోలీసులను సంప్రదించి కేసు నమోదు చేశాడు. పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని 123 (విషప్రయోగం ద్వారా హాని), 316 (నమ్మక ద్రోహం), 318 (మోసం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వెంటనే నగరంలో రోడ్డు పక్కన ఉన్న ఆయుర్వేద టెంట్లను తొలగించే పనిలో పడ్డారు.