ఢిల్లీ పొల్యూషన్ పై నిరసన జనాన్ని ఇలా అరెస్ట్ చేసిన పోలీసులు : మావో హిడ్మా పొస్టర్స్ ప్రదర్శనపై వివాదం

 ఢిల్లీ పొల్యూషన్ పై నిరసన జనాన్ని ఇలా అరెస్ట్ చేసిన పోలీసులు : మావో హిడ్మా పొస్టర్స్ ప్రదర్శనపై వివాదం

 ఢిల్లీలో పొల్యూషన్ కు  వ్యతిరేకంగా  ఇండియా గేట్ దగ్గర విద్యార్థుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నిరసనల్లో కొందరు ఇటీవల చనిపోయిన మావోయిస్టు కమాండర్  హిడ్మా పోస్టర్ ప్రదర్శించడంపై వివాదాస్పదంగా మారింది. హిడ్మకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కొందరు నిరసనకారులు ఆందోళన చేశారు. దీంతో పోలసులు పలువురు నిరసన కారులను అరెస్ట్ చేశారు. హిడ్మా పోస్టర్ ప్రదర్శించిన పలువురు నిరసన కారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిరసన కారులను పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాల   వైరల్ అవుతున్నాయి. అందులో  రోడ్డుపైన పడేసి ఓ నిరసన కారుడి  తలపై చేతితో పోలీసులు నొక్కుతున్నట్లు ఓ ఫోటో వైరల్ అవుతోంది.  

ఢిల్లీలో రోజురోజుకు ఎయిర్ క్వాలిటీ పడిపోతున్న సంగతి తెలిసిందే. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో AQI 400 కు చేరుకుంది. ఆదివారం ఢిల్లీ మొత్తం AQI 391 దగ్గర ఉంది, దాదాపు సగం పర్యవేక్షణ కేంద్రాలు తీవ్ర స్థాయిలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైందంటూ పలువురు విద్యార్థులు, యువత ఢిల్లీ గేట్ దగ్గర నవంబర్ 23న ఆందోళనకు దిగారు. ఈ నిరసనల్లో పలువురు ఎన్ కౌంటర్లో చనిపోయిన  మావోయిస్టు అగ్ర నేత  హిడ్మా  ప్లకార్డులు పట్టుకుని  ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. రెడ్ సెల్యూట్ టూ హిడ్మా..అమర్ రహే హిడ్మా అని నినాదాలు చేశారు.  ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసనకారులకు మద్య వాగ్వాదం జరిగింది. నిరసన కారులు పోలీసులపై పెప్పర్ స్ప్రే  ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు నుంచి  నలుగురు అధికారులు గాయపడ్డారు, వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు .దీంతో పలువురు నిరసన కారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. హిడ్మా పోస్టర్లు ఎలా పంపిణీ చేయబడ్డాయో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.

మోస్ట్ వాంటెడ్ హిడ్మా

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మడవి హిడ్మా.. అతి చిన్న వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరారు. తక్కువ కాలంలోనే పీఎల్జీఏ కమాండర్‌‌‌‌‌‌‌‌గా, మిలటరీ చీఫ్‌‌‌‌గా ఎదిగారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఏకైక ఆదివాసీ మావోయిస్టు నేత హిడ్మానే. మెరుపు వేగంతో దాడులు చేయడం, తప్పించుకోవడం, వ్యూహాలు రచించడంలో దిట్ట. 2007 నుంచి ఇప్పటి వరకు అనేక స్కెచ్‌‌‌‌లు వేసి వందలాది మంది పోలీసులను, వివిధ పార్టీల లీడర్లను చంపిన ఘటనలు ఉన్నాయి.హిడ్మా చివరకు  నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు.