ముంబై: బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. 89 ఏళ్ల ధర్మేంద్ర గత కొంత కాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించడంతో 2025, నవంబర్ 24 సోమవారం తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్లో 300కు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర యాక్షన్ కింగ్, హీ మ్యాన్‌గా ప్రేక్షకులు మన్ననలు పొందారు. ధర్మేంద్ర మృతికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మేంద్ర మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముంబైలోని జూహులో ధరేంద్ర అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.
ధర్మేంద్ర సినీ హిస్టరీ:
బాలీవుడ్ యాక్షన్ కింగ్, హీ మ్యాన్‌గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర (ధరమ్ సింగ్ డియోల్) 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించారు. ఆయనకు ప్రకాశ్ కౌర్, హేమమాలిని ఇద్దరు భార్యలు. ధర్మేంద్రకు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇద్దరు కుమారులు ఉండగా.. కుమార్తెలు ఈషా, అహానా డియోల్ ఉన్నారు. 1960లో దిల్బీ తేరా హమ్బీ తేరే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అనతికాలంలోనే తన నటనతో స్టార్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు.
రొమాంటిక్, కామెడీ, యాక్షన్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన ధర్మేంద్ర తన తరం హీరోల్లో బెస్ట్ యాక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. బాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ షోలే సినిమాలో వీరు పాత్ర ద్వారా కోట్లాదిమంది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. చుప్కే చుప్కేలో తన హాస్య ప్రతిభతో మెప్పించిన ధర్మేంద్ర.. సీతా ఔర్ గీతలో తనలోని ఎమోషనల్ యాక్టర్‌ను ప్రేక్షకులకు చూపించాడు. షోలేలో వీరు పాత్ర నుంచి ఫూల్ ఔర్ పత్తర్, యాదోన్ కీ బారాత్, ధరమ్ వీర్ చిత్రాలలో నటనకు గానూ పలు అవార్డులు అందుకున్నారు.
2024లో విడుదలైన ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా’ సినిమాలో నటించారు. ఆయన చివరగా యాక్ట్ చేసిన ‘ఇక్కిస్’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనువడు ఆగస్య నందా హీరోగా నటిస్తున్నాడు. ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 2012లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డ్ అందుకున్నారు ధర్మేంద్ర.
