వికారాబాద్: పెండ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కూతురు పెండ్లి కోసం ఏర్పాటు చేసిన టెంట్ కిందే కన్నతండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సగెం కుర్దు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అనంతప్ప తన కూతురు అవంతికకు వివాహం నిశ్చయించాడు. ఇవాళ పెండి జరగాల్సి ఉండగా అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నా రు.
ఈ క్రమంలో పెండ్లి సామాగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఆయన మండల కేంద్రానికి తిరిగి వస్తున్న క్రమంలో అదుపుతప్పి బైక్ పై నుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అనంతప్పను చికిత్స కోసం అతడి కుటుంబ సభ్యులు తాండూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. కూతురు పెండ్లి కోసం వేసిన టెంట్ కిందే అనంతప్ప అంతిమ సంస్కారాల నిర్వహణ కు ఏర్పాట్లు జరగడం గ్రామస్తులను తీవ్రంగా కలిచివేసింది.
