పబ్లిసిటీ మోజులోనే పాటలు.. ట్రెండ్ సరే.. ఎండ్ మాటేమిటి?

పబ్లిసిటీ మోజులోనే  పాటలు.. ట్రెండ్ సరే.. ఎండ్ మాటేమిటి?

‘‘చీకటిలోనే పాటలు పుడతాయి’’ అన్నాడు కవి మఖ్దూం. ఇవాళ మాత్రం పబ్లిసిటీ మోజులోనే పాటలు పుడుతున్నాయి. కమర్షియల్ సినిమా పాట వేరు. మనం కాసేపు దానిని పక్కన పట్టి, సమాజంలో వరదై పారుతున్న కొత్త రచయితల పాటల బాగోగులు మాట్లాడుకోవాలి. ఈ ట్రెండింగ్ సాంగ్స్ రాసే రచయితలకు ‘అసలు పాట ఎందుకు రాయాలి’ అనే విషయం తెలుసా? తెలియకపోయినా ఒక ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారా.. అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. 

పాట ఎందుకు రాయాలి? ఈ ప్రశ్న దృక్పథానికి సంబంధించింది. పాట రాయడంలో ఒక్కో రచయితకు ఒక్కో దృక్పథం ఉంటుంది. ఉద్యమాల నేపథ్యం నుండి వచ్చిన రచయితకు ఆ ఉద్యమ లక్ష్యమే తన వస్తువును నిర్దేశిస్తుంది. అందువల్ల ప్రజలను మేల్కొలిపేందుకే ఆ రచయిత పాటను రాస్తాడు. ఇప్పటివరకు తెలంగాణ నేల మీద వచ్చిన ఉద్యమాల్లో పాట ప్రజా చైతన్యం కోసమే సృజించబడింది. ఇవాళ యూట్యూబ్ కేంద్రంగా పాటలు రాస్తున్న చాలామంది యువ రచయితలకు పాట ఎందుకు రాయాలనే విషయంలో స్పష్టత లేదు. 

సాహిత్యం కనిపించదు

ఇవాళ సింహభాగం రచయితలు తమకు పేరు రావాలనే ఏకైక లక్ష్యంతోనే పాటలు రాస్తున్నారు. అది తప్పా, ఒప్పా అని చెప్పి, వారిని దారిలో పెట్టేవారు కరువయ్యారు. అందుకే ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చే యువ రచయితలకు పాటంటే తమకు పేరు తీసుకొచ్చే ఒక సాధనమే. పాటకు రెండు లక్షణాలు ఉంటాయి. 1. అలరించడం 2. ఆలోచింపజేయడం. ఈ రెండు లక్షణాల్లో ఇప్పుడు వస్తున్న పాటలకు అలరించడమే పరమావధిగా మారింది. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని దృష్టిలో పెట్టుకుని జానపదశైలిని అనుకరిస్తూ సరస సల్లాపాల పాటలు రాసి, డీజేల్లో జనాలను చిందేసేటట్టు చేయడమే లక్ష్యం  చేసుకుంటున్నారు. ఈ పాటల్లో భూతద్దం వేసి వెతికినా సాహిత్యం కనిపించదు.  ఎందుకంటే ఆ డీజే సప్పుళ్ల మోత మన చెవులకున్న తుప్పును వదిలిస్తుందే తప్ప, అందులో మన మనసుకు తాకే ఒక్క వాక్యం కూడా దొరకదు. అలాంటి పాటలు ఇవాళ పుట్ట పగిలి చీమలు వచ్చినట్టే వస్తున్నాయి. ఆ వరదలో కొట్టుకుపోతున్న యువ రచయితను చేయి పట్టుకుని ఆపి, ఇలాంటి పాటలు ఎందుకు రాస్తున్నావు, ఇవి రాయడం వల్ల ఈ సమాజానికి ఏం వస్తుందని అడిగే సాహసం చేయలేం. 

విముక్తి కోసం పాట..

సాధారణంగా సీనియర్ పాటగాళ్లయిన  సృజనకారులు సైతం తాము రాసిన పాటలంత గొప్పగా సమాధానాలు చెప్పలేరు. పాటల్లో వారి తప్పుల్ని మనం పట్టుకోలేనంత కవిత్వం కుమ్మరించి మనల్ని ఆశ్చర్యంలో ముంచిన రచయితలే, వారిచ్చే ఇంటర్వ్యూల్లో చెప్పే సమాధానాలు మనల్ని హతాశయుల్ని చేస్తాయి. అందుకు కారణం వారికి పాట మీదున్నంత పట్టు, విషయాన్ని వివరించడంలోనో లేక సమాజ గమనాన్ని సరిగా అర్థం చేసుకోవడంలోనో ఉండదు. అందుకే వారు వారి మాటల్లో ఉట్టిగనే దొరికిపోతుంటారు. యువ పాటగాళ్లు కూడా అంతే... ఇప్పుడు ట్రెండ్ ఇలా ఉంది. మనం కూడా ఇదే కంటిన్యూ చేస్తే సరిపోతది కదా అనిపించిందని నెమ్మదిగా జారుకుంటారు. మరి ఇలాంటి ట్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎండ్ ఏమిటి? ఇలా ఈ యువ రచయితలు పాటను లైట్ తీసుకోవడానికి కారణం... వారికి వారికంటే ముందు పాట పోషించిన పాత్ర తెలియకపోవడమే.

 తాము పాటగాళ్లుగా పుట్టుకురావడానికంటే ముందు ఎన్ని పాటలు వచ్చాయో, అవి ఎలాంటి ప్రభావాన్ని ప్రజల మీద వేశాయో వారికి తెలియదు. అందుకే వారికి పాటంటే ఒక ఎంటర్​టైన్​మెంట్ సాధనంలా భావిస్తున్నారు. కానీ, ప్రజల విముక్తి కోసం ప్రపంచ వ్యాపంగా పాట గొప్ప పాత్రను పోషించింది. అమెరికాలో తెల్లజాతి అహంకారం మీద బాబ్ మార్లే, బాబ్ డిలాన్ల పాటల తూటాలు పేల్చారు.  ప్రజల కోసం పాట పాడినందుకు చిలీ దేశ గాయకుడు విక్టర్ జారాని ఉరితీశారు. అంతెందుకు మనదేశంలో పాటతోటే కోట్లాది హృదయాలను గెలిచిన నిత్యస్ఫూర్తి ప్రజాయుద్ధనౌక గద్దర్ వంటి మహా కళాకారులకు కొదువలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హన్మంతు, బండి యాదగిరి, విప్లవోద్యమంలో సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు, చెరంబడరాజు వంటి వారు పాటతోటే ప్రజల మీద బలమైన ప్రభావాన్ని వేయగలిగారు. ఇక ఇప్పుడున్న వాగ్గేయకారుల జాబితా కూడా తక్కువేం లేదు. జననాట్యమండలి నుండి ప్రజానాట్యమండలి, అరుణోదయ, ప్రజాకళామండలి దాకా సంఘాలుగా వేల పాటల్ని సృజించారు.  

మార్పులను పట్టుకోలేకపోతున్నారు

ఇప్పుడు సామాజిక కోణంలో పాటలు వెలువడడం లేదు. కేవలం ఇలా వచ్చి అలా పోయే పాటలే ఎక్కువగా వస్తున్నాయి. ఇవాళ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. అది అభివృద్ధి దిశలో ఉందా? మరింత వెనుకబాటుకు దారి తీస్తుందా అనేది మరో చర్చ. కాకుంటే ఇవాళ ప్రజల జీవితాల్లో కలుగుతున్న మార్పులను పాటగాళ్లు పట్టుకోలేకపోతున్నారనేది వాస్తవం. ప్రజలను చైతన్యం చేయడం మన పని కాదనే దశకు చేరుకుంటున్నారు యంగ్ రైటర్స్. తమ కెరీర్ ముఖ్యం. తమకు పేరు, డబ్బు రావడం ముఖ్యం. ఆ తరువాతనే సమాజం అనే ధోరణిలో ఉంటున్నారు. 

ప్రజావిముక్తి కోసం రాయబడని పాటకు చరిత్రలో స్థానం లభించదు. అది ప్రజలను ఎంటర్టైన్ చేసి కాలగర్భంలో కలిసిపోవచ్చు. పాట శక్తిని సరిగా అర్థం చేసుకుంటే, పాట పోషించే పాత్ర అర్థం అవుతుంది. అలాంటి మంచి పాట కోసం కాలం ఎదురుచూస్తున్నది.  

‘‘గొంతులేని వారి పక్షాన
గొంతు విప్పే యోధ... పాట!!’’
అందుకే ప్రతీ ప్రజా రచయిత బాధితుల విముక్తి కోసమే పాట రాయాలి. అప్పుడే సృజనకు ఒక అర్థం, విలువ. 

పాటంటే ఆలోచింపజేసేది

ఈ పాట చరిత్ర పట్ల అవగాహన ఉంటే పాట ఎందుకు రాయాలనే విషయంలో స్పష్టత వస్తుంది. తెలంగాణ నేల మీద పాటంటే ఆలోచింపజేసేది, ప్రజలను ఉద్యమాలకు కార్యోన్ముఖులను చేసేది అనే నానుడి ఉంది. ఇవాళ మాత్రం ఆ చరిత్ర ఒక కొత్త టర్న్ తీసుకుంటున్నది. పాట విశాల ప్రజారాశుల విముక్తి కోసం అనుకునే ఆశయానికి సమాధి కడుతూ కాలక్షేప కళాసాధనంగా పాటను మారుస్తున్నారు. పాట ప్రజాసంస్కృతిలో భాగం. అది ప్రజలు సృష్టించిన ఉమ్మడి ఆస్తి. ఆ పాటను ఇవాళ తమకోసం వాడుకుంటున్న యువ కళాకారులు తిరిగి ఆ ప్రజలకు ఏం అందిస్తున్నారో ఆలోచించుకోవాలి. పాటంటే కేవలం ఎంటర్​టైన్​మెంట్ టూల్ కాదని గుర్తించాలి. వందల ఉపన్యాసాలు చేయలేని పని, ఒక్క పాట చేస్తుందని గమనించాలి.

- డా.పసునూరి రవీందర్
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత
77026 48825