ఇయ్యాల జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

ఇయ్యాల జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక శకం ముగిసింది. వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన తార నింగికెగిసింది. సినీ పరిశ్రమలో అనేక ప్రయోగాలకు ఆద్యుడు, దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ (80) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకొని వేలాది మంది అభిమానులు చివరి చూపు కోసం తరలివచ్చారు. సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, కళాభిమానులు కృష్ణకు నివాళులు అర్పించారు. ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను, అందించిన ప్రోత్సాహాన్ని, వ్యక్తిగత సహాయాన్ని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణ మృతికి సంతాపంగా బుధవారం తెలుగు సినీ పరిశ్రమ బంద్ పాటించనున్నట్లు, అన్ని షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిలిపివేస్తున్నట్లు సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ ప్రకటించారు.

పరిస్థితి విషమించి..

హైదరాబాద్ నానక్​రాంగూడలో నివాసం ఉంటున్న ఘట్టమనేని శివరామకృష్ణకు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను దగ్గర్లో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల బృందం కృష్ణ ప్రాణాలు నిలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం సాయంత్రమే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని హాస్పిటల్​ వర్గాలు కుటుంబ సభ్యులకు వివరించాయి. గుండెపోటు కారణంగా శరీరంలోని పలు అవయవాలు (కిడ్నీ, లంగ్స్, లివర్) పని చేయకుండా పోయాయని డాక్టర్లు చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచినట్లు ప్రకటించారు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి తరలివచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కృష్ణ పార్థివదేహాన్ని నానక్​రాంగూడలోని ఇంటికి తరలించారు.

తరలి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

కృష్ణ ఇంటికి వచ్చిన అనేక మంది రాజకీయ ప్రముఖులు అక్కడ ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​రావు, పువ్వాడ అజయ్​కుమార్, ప్రశాంత్​రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్, ఎంపీ సంతోష్​కుమార్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, సుబ్బరామిరెడ్డి, సీపీఐ నేత నారాయణ, బీజేపీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తదితరులు నివాళులు అర్పించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్, మోహన్​బాబు, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు, మురళీ మోహన్, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య, రామ్​చరణ్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, మంచు విష్ణు, రాజేంద్ర ప్రసాద్, జీవిత, రాజశేఖర్, నాగబాబు, జగపతిబాబు, కీరవాణి తదితరులు తరలి వచ్చారు. కృష్ణతో తమకు ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్​ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు.

ఇయ్యాల పద్మాలయ స్టూడియోకు పార్థివ దేహం

అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం 9 గంటలకు కృష్ణ పార్థివ దేహాన్ని నానక్​రాంగూడలోని ఆయన నివాసం ‘విజయకృష్ణ’ నుంచి పద్మాలయ స్టూడియోకు తరలిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ అభిమానుల సందర్శన, పూజల తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మంగళవారం సాయంత్రం కృష్ణ పార్థివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించాలనే ప్రతిపాదనను కుటుంబ సభ్యులు క్యాన్సిల్ చేసుకున్నారు.

సినీ లోకానికి తీరని లోటు: మోడీ

సూపర్ స్టార్ కృష్ణ తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండ్​ అని పీఎం నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పారు. ఈ విషాదకర సమయంలో కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

మిత్రుడిని కోల్పోయా: కేసీఆర్

తాను వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానని సీఎం కేసీఆర్ అన్నారు. కృష్ణ ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని చెప్పారు. ఎంపీగా దేశానికి సేవ చేశారని కొనియాడారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను తాను చాలా సార్లు చూశానని తెలిపారు. గతంలో అల్లూరి సీతారామరాజు సినిమా గురించి ఆయన వద్ద ప్రస్తావిస్తే, ‘మీరు కూడా సినిమాలు చూస్తారా?’ అని కృష్ణ అన్నారని గుర్తుచేసుకున్నారు. ఒక కళాకారునిగా కృష్ణ సీనియారిటీని,  చేసిన సేవలను గుర్తిస్తూ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

దిగ్భ్రాంతికి గురి చేసింది: రాహుల్  

తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన ప్రొఫెషనల్ డిసిప్లిన్, వర్క్ ఎథిక్స్ ప్రజా జీవితంలో ఒక ఉదాహరణగా నిలిచాయని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

బాధాకరం: గవర్నర్ తమిళిసై

‘‘సూపర్ స్టార్ కృష్ణ మృతి బాధాకరం. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతున్నా” అని గవర్నర్​ తమిళిసై అన్నారు.