బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా నటించిన ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కమర్షియల్ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. పండుగ వేళ అభిమానులను అలరించాల్సిన ఈ యాడ్, అనూహ్యంగా వివాదాలకు వేదికగా మారింది. రక్షా బంధన్ థీమ్‌తో తెరకెక్కిన ఈ ప్రకటనలో కృతి శైలి, కాన్సెప్ట్ నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాయి.
ఈ యాడ్‌లో కృతి సనన్ డిజైనర్ ఆఫ్-వైట్ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, కేప్, డ్రేప్డ్ స్కర్ట్‌తో ఇండో-వెస్ట్రన్ లుక్‌లో దర్శనమిచ్చారు. అయితే, పవిత్రమైన రాఖీ పండుగకు ఇలాంటి 'హాట్ & స్కింపీ' దుస్తులు ఏమాత్రం తగవంటూ కొందరు నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. 'సొంత సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఇలాంటి దుస్తులేనా వేసుకునేది? మన సంప్రదాయాలను, పండుగలను అవమానించడమేనా ఇది?' అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వివాదం ఇంతటితో ఆగలేదు. యాడ్‌లో కృతి తన పెంపుడు కుక్కకు రాఖీ కట్టడం మరో పెద్ద చర్చకు దారితీసింది. 'అన్నదమ్ముల ప్రేమానురాగాలకు ప్రతీకైన పండుగలో కుక్కకు రాఖీ కట్టి, సొంత సోదరుడి కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చూపించడం ఏంటి?' అని నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇతర మతాల పండుగల విషయంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తారా అని నేరుగా కృతిని, ఆ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ యాడ్ రూప్‌ను 'షేమ్‌ఫుల్' అని కొందరు కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం మోడర్న్ థాట్ అని సమర్థిస్తున్నారు. అయితే, ఈ రచ్చపై కృతి సనన్ గానీ, జ్యువెలరీ యాజమాన్యం గానీ ఇప్పటివరకు పెదవి విప్పలేదు. ఇటీవల షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి 'కాక్టైల్ 2'తో పలకరించింది కృతి. అయితే ఈ పండుగ వేళ ఊహించని రీతిలో ట్రోలింగ్ సెగ తగిలిందీ బ్యూటీకి.. మరి దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి..
