Rashmika Mandanna: ‘కాక్‌టెయిల్ 2‌‌‌‌’ ఈవెంట్‌లో గందరగోళం.. ఒక్కసారిగా రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్.. కాపాడిన కృతి సనన్!

Rashmika Mandanna: ‘కాక్‌టెయిల్ 2‌‌‌‌’ ఈవెంట్‌లో గందరగోళం.. ఒక్కసారిగా రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..  కాపాడిన కృతి సనన్!

బాలీవుడ్ వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రానున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కాక్‌టెయిల్ 2‌‌‌‌’. స్టార్ హీరో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రబృందం వరుస ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అందులో భాగంగా షాహిద్, రష్మిక, కృతి సనన్ పుణెలో నిర్వహించిన మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.

అయితే పుణెలోని ఓ ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. హీరో హీరోయిన్లను దగ్గరగా చూడటంతో పాటు వారితో ఫొటోలు దిగేందుకు అభిమానులు భద్రతా బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల రద్దీ కారణంగా షాహిద్ కపూర్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వీడియోల్లో కనిపించగా, మరోవైపు రష్మిక మందన్నను కృతి సనన్ గట్టిగా పట్టుకుని సురక్షితంగా బయటకు తీసుకెళ్లిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కృతి సనన్ చూపిన సమయస్ఫూర్తి, తోటి నటిపై ఆమె ప్రదర్శించిన శ్రద్ధకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఒక అక్కలా’ రష్మికను కాపాడింది అంటూ సోషల్ మీడియాలో కృతిని కొనియాడుతున్నారు. కాగా, ఈ ఘటనపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

జూన్ 19న థియేటర్లలో..

ఈ సినిమాకు తరుణ్ జైన్, లవ్ రంజన్ కథా రచన అందించగా, హోమీ అదాజానియా దర్శకత్వం వహించారు. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇకపోతే, ఈ రొమాంటిక్ మూవీ 2012లో విడుదలైన 'కాక్‌టెయిల్'కి సీక్వెల్. దాదాపు 14 ఏళ్ళ తర్వాత మూవీకి సీక్వెల్ వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.