ఆ పది ప్రాజెక్టుల పనులు చెయ్యొద్దు.. తెలంగాణకు కృష్ణా బోర్డు ఆదేశం

ఆ పది ప్రాజెక్టుల పనులు చెయ్యొద్దు.. తెలంగాణకు కృష్ణా బోర్డు ఆదేశం
  • డీపీఆర్‌‌లు ఇచ్చి పర్మిషన్‌‌ తీసుకోండి
  • తెలంగాణకు కృష్ణా బోర్డు ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: డీపీఆర్‌‌లు ఇచ్చి పర్మిషన్​ తీసుకునే వరకు పది ప్రాజెక్టుల పనులు చేయొద్దని తెలంగాణ సర్కార్​ను కృష్ణా రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు(కేఆర్‌‌ఎంబీ) ఆదేశించింది. బోర్డు మెంబర్‌‌ హరికేశ్‌‌ మీనా గురువారం ఇరిగేషన్‌‌ ఈఎన్సీ మురళీధర్‌‌కు లెటర్‌‌ రాశారు. పులిచింతల ప్రాజెక్టు ఫోర్‌‌షోర్‌‌లో చేపట్టిన బుగ్గమందారం, అమరావరం, రేవూరు, చింతలపాలెం, ఎర్రగట్టుతండా, చౌటపల్లి లిఫ్ట్‌‌ స్కీంలు, జూరాలపై ప్రతిపాదించిన జూరాల పాకాల వరద కాలువ, మూసీ నదిపై చేపట్టిన శూన్యపహాడ్‌‌ లిఫ్ట్‌‌, రేలంపాడు రిజర్వాయర్ పై చేపట్టిన గట్టు ఎత్తిపోతల, కోయిల్‌‌ సాగర్‌‌ లిఫ్ట్‌‌ స్కీంల డీపీఆర్‌‌లు వెంటనే ఇవ్వాలన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్టును అతిక్రమించి అనుమతులు లేకుండా తెలంగాణ కొత్త లిఫ్ట్‌‌ స్కీంలు చేపడుతోందని ఏపీ ఫిర్యాదు చేసిందని ఆ లెటర్‌‌లో పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ, కేఆర్‌‌ఎంబీ టెక్నికల్‌‌ అప్రైజల్‌‌, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి తీసుకునే వరకు ఆ ప్రాజెక్టుల పనులు చేపట్టొద్దని తేల్చిచెప్పారు.

కమిటీ ఏర్పాటుపై అభిప్రాయం చెప్పండి

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు సందర్శించేందుకు నిజ నిర్దారణ కమిటీ వేయాలన్న ఏపీ విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలని కృష్ణా బోర్డు రాష్ట్రాన్ని కోరింది. తెలంగాణ సర్కారు చేపడుతున్న పలు ప్రాజెక్టుల పనులు పరిశీలించేందుకు సీనియర్‌‌ ఆఫీసర్లతో ఫ్యాక్ట్‌‌ ఫైండింగ్‌‌ కమిటీ వేయాలని ఏపీ ఇటీవల కృష్ణా బోర్డును కోరిన సంగతి తెలిసిందే.