కేఎస్ రత్నం భారీ మెజార్టీతో గెలవడం ఖాయం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కేఎస్ రత్నం భారీ మెజార్టీతో గెలవడం ఖాయం : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • చేవెళ్ల సెగ్మెంట్​లో బీజేపీ బలంగా ఉంది
  • కేంద్రమంత్రి బీఎల్ వర్మ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  • ఉత్సాహంగా కేఎస్ రత్నం నామినేషన్ ర్యాలీ

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీజేపీ బలంగా ఉందని కేంద్రమంత్రి బీఎల్ వర్మ, మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చేవెళ్ల సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం నిర్వహించిన నామినేషన్ ర్యాలీలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు బలంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లీడర్ల డబ్బులతో నడుస్తాయని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్యపై చేవేళ్లలో ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందన్నారు. బీజేపీకి కాంగ్రెస్​తోనే పోటీ అని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం హైదరాబాద్– బీజాపూర్ నేషనల్ హైవేపై షాబాద్ చౌరస్తా నుంచి చేవెళ్ల ఆర్డీవో ఆఫీసు వరకు డప్పు, డోలు వాయిద్యాలతో డీజే చప్పుళ్లతో  ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం కేఎస్ రత్నం ఆర్డీవో ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పేపర్లను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాశ్, మండల పార్టీ అధ్యక్షుడు దేవర పాండు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, పార్టీ సీనియర్ నేత భీమేందర్ రెడ్డి,  బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గుడిపల్లి మధుసూదన్ రెడ్డి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు చేగూరి ప్రవీణ్ రెడ్డి, బీజేపీ  కార్యకర్తలు పాల్గొన్నారు.