- అధికారంలోకి రావడానికి టీడీపీ, శివసేన వంటి పార్టీలను వాడుకుంది: కేటీఆర్
- బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ఫెయిల్
- కాంగ్రెస్‌కు మెడలో కట్టిన బరువులా రాహుల్ నాయకత్వం
- బీజేపీకి ప్రత్యామ్నాయం ప్రాంతీయ పార్టీలే
- శివ నాడార్ ఫౌండేషన్ సదస్సులో కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: వారసత్వ రాజకీయాలు కేవలం పాలిటిక్స్‌లోకి రావడానికి ఉపయోగపడతాయని, అయితే, ఐదేండ్లకోసారి ప్రజల ఆమోదం ఉంటేనే ఇక్కడ కొనసాగుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వ్యాపారాల్లో, కంపెనీల్లోనూ వచ్చినట్లుగా వారసత్వం ద్వారా రాజకీయాల్లో అన్ని రావని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకే ఇక్కడ కొనసాగగలమని పేర్కొన్నారు.
వారసత్వ రాజకీయాల గురించి పదేపదే మాట్లాడే బీజేపీ.. తన రాజకీయ అవసరాల కోసం అవకాశవాదంతో కుటుంబ పార్టీలైన శివసేన, టీడీపీ, జేడీయూ వరకు అన్ని రకాల పార్టీలతో రాజకీయ పొత్తు పెట్టుకుందని గుర్తుచేశారు. మంగళవారం చెన్నైలో శివ్ నాడార్ ఫౌండేషన్ నిర్వహించిన ఇగ్నిషన్ సదస్సులో కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండాను, ఒక మోడల్‌ను దేశానికి అందించడంలో ఆ పార్టీ ఫెయిలైందని ఆరోపించారు. దేశ ప్రధానికి అతిపెద్ద బలంగా రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం మారిందని ఎద్దేవా చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించిందేమీ లేదని, మరోవైపు రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘకాల విజన్ లేదని విమర్శించారు.
దేశంలోని ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇన్నొవేషన్, పారిశ్రామిక ప్రగతిపై రాహుల్ గాంధీ మాట్లాడడం ఏనాడు చూడలేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమని, ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యం
అవుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మొండి చేయడం వల్లే..
బిహార్ వంటి రాష్ట్రాల్లో తోక పార్టీ లాంటి కాంగ్రెస్.. అనేక స్థానాల్లో పోటీ చేస్తామని మొండికి పోవడం వల్లే బీజేపీకి లబ్ధి చేకూరిందని కేటీఆర్ అన్నారు. గతంలో కేసీఆర్ ప్రాంతీయ పార్టీల వేదిక ఒకటి ఏర్పాటు చేసి దేశానికి ప్రత్యామ్నాయ నమూనాను అందించాలని ప్రయత్నించారని, దురదృష్టవశాత్తు అది ముందుకు పోలేదన్నారు.
దేశంలోని ప్రతిపక్షం మెడలో కట్టిన పెద్ద మొద్దు లెక్కన రాహుల్ గాంధీ నాయకత్వం తయారైందన్నారు. అందుకే వరుసగా ఒక రాష్ట్రం తర్వాత ఇంకొక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతూ వస్తున్నదని చెప్పారు. సౌత్‌లో బీజేపీకి భవిష్యత్ ఉందని తాను అనుకోవడం లేదన్న కేటీఆర్.. రానున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించి బలమైన పాఠం చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ విభజన రాజకీయాలు ఎండగట్టడంలో ప్రతిపక్షాలుగా తాము విఫలమయ్యామన్నారు.
