- కిడ్నాపులు, దాడులు, అక్రమాలతో పదవులు లాక్కునే కుట్ర: కేటీఆర్
- రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారింది.. డీజీపీ జోక్యం చేసుకోవాలని కామెంట్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు గుండాల మాదిరి వ్యవహరించారని బీఆర్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన ప్రభుత్వం.. పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందిందన్నారు. స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలే తమ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడంతోపాటు ఎక్కడికక్కడ దాడులకు తెగబడ్డారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
“మంత్రులు, ఎమ్మెల్యేలే నేరుగా అక్రమ పద్ధతుల్లో చైర్మన్ల ఎంపిక ప్రక్రియలో తలదూర్చారు. అనేక చోట్ల కాంగ్రెస్ నాయకులు పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి బెదిరింపులు, పార్టీ మార్పులు, దాడులకు పాల్పడ్డారు. దీనిని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారాయో అర్థమవుతున్నది. వెంటనే డీజీపీ జోక్యం చేసుకోవాలి” అని కేటీఆర్ పేర్కొన్నారు.
