తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్..కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్..కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అరాచకాలతో రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా మార్చిందని, రేవంత్ రెడ్డి ఒక బలహీన సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము రాష్ట్రాన్ని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ లో అగ్రస్థానంలో నిలిపామని, కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకువచ్చిందని విమర్శించారు. మంత్రులు, సీఎం అనుచరులే వ్యాపారవేత్తలను గన్నులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. 

 రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘పింక్ బుక్కులు, రెడ్ బుక్కులు ఉండవు, కాకీ బుక్కు మాత్రమే ఉంటుందని చెప్పిన డీజీపీ ఎక్కడ? గన్నులతో బెదిరింపులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని ప్రశ్నించారు. గన్ కల్చర్ వ్యవహారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోహిణ్ రెడ్డి, సుమంత్ వంటి వారిని ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. 

కాంగ్రెస్ నేతల అవినీతి, వేధింపులు తట్టుకోలేక నిజాయితీపరులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీఆర్ఎస్ తీసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ జీవితంలో ఇంతటి బలహీన సీఎంను చూడలేదని అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సొంత మంత్రులే ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటుంటే, వారిని కనీసం నియంత్రించలేని నిస్సహాయ స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు.