జ్ఞానేశ్.. పదవి నుంచి దిగిపో..రాజ్యాంగం కన్నా ఎవరూ ఎక్కువ కాదని కామెంట్ : కేటీఆర్, హరీశ్ రావు

జ్ఞానేశ్.. పదవి నుంచి దిగిపో..రాజ్యాంగం కన్నా ఎవరూ ఎక్కువ కాదని కామెంట్ : కేటీఆర్, హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: చీఫ్​ఎలక్షన్​కమిషనర్​జ్ఞానేశ్​కుమార్​పదవి నుంచి తప్పుకోవాలని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్ రావు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్​లో స్పందించారు. రాజ్యాంగం కంటే గొప్పది ఏదీ లేదని, ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కునూ లాక్కునే అధికారం ఎవరికీ లేదని కేటీఆర్​ పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న జ్ఞానేశ్​ కుమార్ తక్షణమే తన బాధ్యతల నుంచి వైదొలగాలని డిమాండ్  చేశారు. దేశ మూల సిద్ధాంతాలను, ఆత్మను తుంగలో తొక్కుతూ సమాంతర వ్యవస్థలను నిర్మించాలని చూసే వారికి కాలం చెల్లిందని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి, సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. 

జ్ఞానేశ్​.. ఇట్స్​ డన్ బ్రో: హరీశ్​ రావు

ప్రజల్లో విశ్వసనీయతను కాపాడలేకపోతే జ్ఞానేశ్​కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్​ చేశారు. ‘జ్ఞానేశ్​.. ఇట్స్​ డన్​ బ్రో’ అంటూ ఎక్స్​లో పోస్ట్​చేశారు. ఈసీ పనితీరు, స్వతంత్రతపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, అధికారంలో ఉన్నవాళ్లకు రక్షణ కవచం కాదని పేర్కొన్నారు. ఈసీ స్వతంత్రత, నియామకాలపై అనుమానాలు రావడం మన రాజ్యాంగ ప్రజాస్వామ్యానికే పెను ముప్పు అని అన్నారు. ఆర్టికల్స్ 324, 325, 326 సహా ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం ఎన్నికల వ్యవస్థ పూర్తిగా నిష్పాక్షికంగా, పారదర్శకంగా పనిచేయాలని పేర్కొన్నారు. వ్యక్తులు, ప్రభుత్వాల కంటే కూడా ప్రజాస్వామ్యమే అత్యున్నతమైనది, గొప్పదన్నారు.