యాదాద్రిపై కేటీఆర్, సంజయ్ ట్విట్టర్ వార్

యాదాద్రిపై కేటీఆర్, సంజయ్ ట్విట్టర్ వార్
  • ఆలయాల నిర్మాణం భవిష్యత్తు పెట్టుబడి అన్న కేటీఆర్​ 
  • గుళ్లు వ్యాపార కేంద్రాలా అంటూ సంజయ్  ఫైర్
  • యాదాద్రిపై మాటల యుద్ధం

హైదరాబాద్​, వెలుగు : యాదాద్రి ఆలయ అభివృద్ధిని మంత్రి కేటీఆర్ పెట్టుబడిగా చూపడంపై దుమారం రేగుతోంది. దావోస్ పర్యటనకు వెళ్లిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాము తెలంగాణను ఎంతో అభివృద్ధి చేస్తున్నామని, కొందరు ఓర్వలేక అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. ‘‘యాదాద్రి లాంటి అద్భుతమైన టెంపుల్ ను పునర్నిర్మాణం చేసినం. దానికి వెయ్యో, 1200 కోట్లో ఖర్చు పెడితే, అది భవిష్యత్ మీద పెట్టిన పెట్టుబడి కాదా? ఇవాళ యాదాద్రికి రోజుకు కోటి రూపాయల సంపద వస్తున్నది. అది పెట్టుబడి అయితదా? అప్పయితదా?” ‌‌అంటూ కేటీఆర్  వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్  స్పందించారు. కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని ఆయన ఫైరయ్యారు.

బీఆర్‌ఎస్ ఖమ్మం సమావేశానికి ముందు హిందూ దేవాలయాన్ని పెట్టుబడి అవకాశంగా చూపించేందుకే ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకెళ్తున్నారా అంటూ ఆయన ట్విట్టర్ లో  కేటీఆర్ కు కౌంటర్  ఇచ్చారు. మరోవైపు కేటీఆర్  వ్యాఖ్యలపై సోషల్  మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెడితే రోజుకు కోటి రూపాయల ఆదాయం వస్తున్నదని మాట్లాడడం ఏందని కేటీఆర్ ను పలువురు నిలదీస్తున్నారు. తాను భయంకరమైన హిందువును అని చెప్పే కేసీఆర్  కొడుకు.. దేవుడి మీద వ్యాపారం చేస్తున్నట్టు చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఖమ్మం సభలో పాల్గొనేందుకు హైదరాబాద్​ వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయ్ విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్ కు వ్యాపార సామ్రాజ్యాన్ని చూపించేందుకే యాదాద్రికి తీసుకెళ్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.