కాళేశ్వరం గురించి కాంగ్రెసోళ్లకు అ.. ఆలు కూడా తెల్వదు: కేటీఆర్

కాళేశ్వరం గురించి కాంగ్రెసోళ్లకు అ.. ఆలు కూడా తెల్వదు: కేటీఆర్
  • ప్రాజెక్టు కట్టిందే మేము.. చూడాల్సింది మేము కాదు
  •     ఎక్కడైనా తప్పులు జరిగితే బయట పెట్టాలి
  •     రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఒక క్రిమినల్ అని కామెంట్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ వాళ్లు మూర్ఖులు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. చూడాల్సింది వాళ్లు, మేము కాదు. ఆ ప్రాజెక్టు గురించి వాళ్లకు అ ఆలు కూడా తెలియదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టును చూడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు వెళ్లి చూడొచ్చు.”అని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నరని విమర్శించారు.

సూర్యుడి మీద ఉమ్మేస్తే అది మన మొహం మీదనే పడుతుందని తెలుసుకోవాలన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ డెప్త్ తెలుసుకుంటే మంచిదన్నారు. చిన్న, చిన్న లోపాలుంటే ఎత్తిచూపాలని, ఐఏఎస్​ల మీద ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం రాజకీయం కోసమే ప్రాజెక్టును వాడుకుంటున్నారని, బట్ట కాల్చి మీద వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు

రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఒక క్రిమినల్​అని.. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అని కేటీఆర్​విమర్శించారు. ఆయనకు క్రిమినల్​ఆలోచనలు తప్ప ఇంకొకటి తెలియదన్నారు. అధికారం ఆయన చేతిలోనే ఉందని.. ఎవరిపైన అయినా నిరంభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. రేవంత్​రెడ్డి సీఎం అయిన రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. ఈ నెల 13న నిర్వహించే చలో నల్గొండకు కృష్ణా బేసిన్​లోని మహబూబ్​నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్​ జిల్లాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలన్నారు. బీఆర్ఎస్ ​నుంచి ఎవరైనా వెళ్తామంటే తాము చేసేది ఏమీ ఉండదన్నారు.  

అయోమయంగా కాంగ్రెస్ ​60 రోజుల పాలన

కాంగ్రెస్​ పార్టీ 60 రోజుల పాలన అయోమయంగా ఉందని కేటీఆర్​ విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ ​ప్రభుత్వం హైదరాబాద్​నగర అభివృద్ధిని అడ్డుకుంటోందని అన్నారు. కాంగ్రెస్​పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోనే 13 హామీలు ఉన్నాయని, వాటితో పాటు ఇంకో 420 హామీలు ఇచ్చిందని.. కానీ, వాటి అమలుకు బడ్జెట్​లో కేటాయించింది రూ.57 వేల కోట్లు మాత్రమేనన్నారు. పథకాలకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్​లో చెప్పలేదన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్​యాదవ్,​ మహమూద్​అలీ, పద్మారావు గౌడ్, మేయర్​గద్వాల్​విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్​, మాగంటి గోపినాథ్​, బండారి లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ పాల్గొన్నారు.

డిప్యూటీ మేయర్​ డుమ్మా

జీహెచ్​ఎంసీ కార్పొరేటర్ల మీటింగ్​కు డిప్యూటీ మేయర్ ​మోతె శ్రీలత హాజరుకాలేదు. పార్టీ సీనియర్​నాయకుడు మోతె శోభన్​రెడ్డి కూడా రాలేదు. దీంతో వారిద్దరు పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ డిప్యూటీ మేయర్ ​బాబా ఫసియుద్దీన్​ కాంగ్రెస్​లో చేరడంతో మిగతా వారిని కాపాడుకోవడా నికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యమం నుంచి క్రియాశీలంగా పనిచేస్తున్న శోభన్​రెడ్డి సికింద్రాబాద్​ఎమ్మెల్యే టికెట్​ఆశించారు. ప్రస్తుతం ఎంపీ టికెట్​ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ నుంచి స్పష్టత రాకపోవడంతోనే ఆయన బీఆర్ఎస్​ను వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

హామీల అమలుకు 1.25 లక్షల కోట్లు కావాలి

సికింద్రాబాద్, వెలుగు: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు రూ.1.25 లక్షల కోట్లు అవసరమైతే... ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.53వేల కోట్లు మాత్రమే కేటాయించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. శనివారం సికింద్రాబాద్ లో జరిగిన సనత్​నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద 18 ఏండ్లు నిండిన ఒక్కొక్క మహిళకు రూ.2500 ఆర్థికసాయం అదించేందుకు ఏడాదికి రూ.58 వేల కోట్లు అవసరమన్నారు.

రైతు రుణమాఫీకి రూ.39వేల కోట్లు, రైతు భరోసాకు రూ.24వేల కోట్లు కావాలని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్​లో రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించి తప్పించుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. 100 రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే ఈ సర్కార్‌‌ భరతం పడతామని హెచ్చరించారు. 24 ఏండ్లలో కేసీఆర్​ను ఖతం చేస్తం అంటూ ఎంతో మంది తీస్మార్​ ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేకపోయారని నీ లాంటి వాళ్ల​తో ఏమవుతుందని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి  కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుంచి చార్మినార్, కాకతీయు తోరణాన్ని తొలగిస్తామని రేవంత్ అంటున్నారని.. ఆయనకు వాటి చరిత్ర తెలియదన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయకపోతే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.