హైదరాబాద్: తెలంగాణ మహిళలకు బీఆర్ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్షమాపణ చెప్పారు. రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలని, అప్పుడు ఫ్యామిలీలకు ఫ్యామిలీలు పొయ్యి అందులో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని చేసిన వ్యాఖ్యలపై తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా క్షమాపణ చెప్పారు. ‘‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను.. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’’ అని కేటీఆర్ పోస్ట్ చేశారు.
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
— KTR (@KTRBRS) August 16, 2024
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలని, అప్పుడు ఫ్యామిలీలకు ఫ్యామిలీలు పొయ్యి అందులో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మహిళా ప్రయాణికులనుద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా సమాజం భగ్గుమంది. కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు.
‘‘బస్సులో అల్లం, ఎల్లిపాయలు ఒలిస్తే తప్పా అని మంత్రి సీతక్క అడుగుతున్నరు. తప్పని మేం ఎక్కడన్నం అక్క. మేం అన్లేదు. కాకపోతే దానికోసమే బస్సు పెట్టిర్రని మాకు తెల్వక మేం ఇన్నిరోజులు మామూలుగా బస్సులు నడిపినం. మాకేమో తెల్వకపాయే. మీరు అప్పుడే చెబితే బాగుండు. బస్సుల సంఖ్య పెంచు. మనిషికో బస్సు పెట్టు. కుటుంబాలకు కుటుంబాలు పోయి అందులో కుట్లు, అల్లికలు చేసుకుంటరు. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, ఇంకేమేం చేసుకుంటారో చేసుకోనియండి. మేమెందుకు వద్దంటం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బస్సు సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండెనా? అని ప్రశ్నించారు. ‘‘సీట్ల కోసం కొట్టుకునుడు, సిగలు పట్టుకునుడు, గుద్దుకునుడు, ఎన్నెన్ని కొత్తకొత్తయి చూస్తున్నం. ఆఖరికి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నెత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది” అని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
