కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని మున్సిపల్ సిబ్బందికి నోటీసులు

కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని మున్సిపల్ సిబ్బందికి నోటీసులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ చిన్నపాటి రీజన్ తో నలుగురు మున్సిపల్ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. వాళ్లు సరిగ్గా విధులు నిర్వహించడం లేదనో.. లేక డ్యూటీకి సరిగ్గా రావడం లేదనో..ఇతరత్రా కారణాలతో వారికి నోటీసులు ఇవ్వలేదు. కేవలం మంత్రి కేటీఆర్ బర్త్ డే కార్యక్రమానికి రాలేదని వారికి మెమోలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. నలుగురు మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మెమోలు జారీ చేయడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ నెల 24న బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ లో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నలుగురు సిబ్బంది హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదు ? 24 గంటల్లో వివరణ ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి, జూనియర్ అసిస్టెంట్ పున్నంచందర్, సిస్టం మేనేజర్ మోహన్, బిల్ కలెక్టర్ శ్రావణ్ లకు షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. 

జూలై 24వ తేదీన మంత్రి కేటీఆర్ జన్మదినం. ప్రతి సంవత్సరం ఆయన బర్త్ డేను నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటారు. కానీ.. ఈసారి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే... మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. ఎడమకాలికి గాయమైనట్లు ఆయన ట్వీట్ చేశారు. మూడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు.