నేనా సీఎం అవన్నీ ఊహాగానాలే : కేటీఆర్

నేనా సీఎం అవన్నీ ఊహాగానాలే : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ‘‘నేను సీఎం అవుతాననేది ఊహాగానమే.. గతంలోనే ఈ విషయంపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. మీడియా ప్రతినిధులు పదే పదే అడగడం వల్లే మంత్రులు అట్లా మాట్లాడుతున్నారు’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  చెప్పారు. ఈ ఊహాగానాలు ఇంకెంత కాలం అని ప్రశ్నించగా.. నవ్వుతూ సమాధానం దాటవేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్​ చిట్ చాట్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్లు, ప్రతిపక్షాల ఆరోపణలు, పట్టణాల అభివృద్ధిపై కేంద్రం తీరు, రెబల్స్ వ్యవహారం, కొందరు లీడర్లు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు తదితర అంశాలపై స్పందించారు. మున్సిపల్​ ఎలక్షన్లలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని, టీఆర్ఎస్ రెబల్స్​కు ప్రచారం చేసే దుస్థితిలో ఆ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై, అనైతికంగా లోపాయకారీ ఒప్పందం చేసుకున్నాయని, పది పదిహేను మున్సిపాలిటీల్లో కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.

కేసీఆర్​పై ప్రజలకు నమ్మకముంది

టీఆర్ఎస్ పాలనపై బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్​ చార్జిషీట్ విడుదల చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ఐదేండ్ల మా పాలనపై చార్జ్ షీట్ అంటే మరి అరవై ఏండ్ల అసమర్థ పాలనపై ఎన్ని చార్జ్ షీట్లు వేయాలి. మున్సిపాలిటీలను మురికి కూపాలుగా మార్చిన్రు. ప్రచారం కోసం, ప్రకటనల కోసం కాకుండా ఎన్నికల బరిలో పూర్తిస్థాయి అభ్యర్థులను నిలపడంపై లక్ష్మణ్ దృష్టి పెడితే బాగుంటది. దేశంలో ఎన్ని పట్టణాలను స్మార్ట్  సిటీలుగా మార్చారో చెప్పాలె.

ఏ పట్టణంలో అమృతం పారుతుందో చూపాలె. బీజేపీ నేతలు ఎంత గింజుకున్నా కేసీఆర్ పై ప్రజలకు అపార నమ్మకముంది” అన్నారు. కేసీఆర్ మదిలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయటికి వస్తాయని తెలిపారు.

రెండు లక్షల ఇండ్లు కట్టినం..

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం చేసింది గుండు సున్నా అని, స్థానిక ఎన్నికల కోసం బీజేపీ ఏం ప్రచారం చేయాలో తెలియని పరిస్థితిలో ఉందని కేటీఆర్​ విమర్శించారు. ‘‘తెలంగాణలో మాదిరిగా దేశంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టారా..? ఇక్కడ రూ.8 వేల కోట్లతో 2 లక్షల ఇండ్లు కట్టినం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాలు విసురుతున్నా, కొల్లూరులో కడ్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను చూసేందుకు వస్తానంటే ఎర్ర తివాచీ పరిచి ఇండ్ల నిర్మాణం చూపిస్తా” అని పేర్కొన్నారు. ఐదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడలేని దుస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయని కామెంట్​ చేశారు.

కాంగ్రెస్ ది డొల్ల విజన్

మున్సిపల్ ఎలక్షన్లకోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన డాక్యుమెంట్ డొల్ల అని కేటీఆర్ విమర్శించారు. ‘‘ఇప్పటికే మేం అమలుచేస్తున్న ఐదు రూపాయల భోజనాన్ని గతంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా మెచ్చుకున్నరు. ఇప్పుడు వాళ్లు సింగిల్ విండో అనుమతులు చేస్తామంటుంటే నవ్వొస్తోంది. మేం ఇప్పటికే చట్టంలో పెట్టాం. అధికారంలోకి వస్తే హమీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవనే అవగాహన కూడా లేదు. ఎన్నికల్లేకుండా అధికారంలోకి ఎలా వస్తారనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పాలె..” అని పేర్కొన్నారు.

అంతా దారిలోకి వస్తరు

మున్సిపాలిటీల్లో 90 శాతం రెబల్స్ సమస్య తీరిందని, కొన్ని చోట్ల సమస్య ఉందని, వాటిని కూడా త్వరలో తీర్చుతామని కేటీఆర్  చెప్పారు. కొల్లాపూర్ అయినా, ఏదయినా అందరూ దారిలోకి వస్తారని.. రెండు మూడు రోజుల్లో పరిస్థితి మీరే చూస్తారని పేర్కొన్నారు. ఓ మంత్రి మున్సిపల్ టికెట్లు అమ్ముకున్నారన్న వార్తలను ప్రస్తావించగా.. ‘‘టికెట్ రానివాళ్లు అమ్మేసుకున్నారంటూ మా మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. వాటిని పట్టించుకోం. చాలా మంది టికెట్ కోసం ఆశపడ్డారు. రాని వాళ్లు అలా మాట్లాడుతారు. 3,100 టికెట్లు ఇస్తే ఎన్ని చోట్ల అసంతృప్తి ఉందో చూడాలె..’’ అని కేటీఆర్​ చెప్పారు.

మజ్లిస్​తో ఎప్పుడూ పొత్తు లేదు

ఎంఐఎంతో టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ పొత్తు లేదని, దీనిపై బీజేపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్​ ఆరోపించారు. భైంసాలోని 3 వార్డుల్లో స్థానిక కారణాల వల్ల మజ్లిస్ ఏకగ్రీవమైందన్నారు. మత, జాతీయపరమైన అంశాలు స్థానిక ఎన్నికల్లో పనిచేయవని చెప్పారు.