K Ramp Review: ‘కె ర్యాంప్’ ఫుల్ రివ్యూ.. కిరణ్ అబ్బవరం రొమాంటిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

K Ramp Review: ‘కె ర్యాంప్’ ఫుల్ రివ్యూ.. కిరణ్ అబ్బవరం రొమాంటిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ (K Ramp) మూవీ నేడు (అక్టోబర్ 18న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త దర్శకుడు జైన్స్ నాని రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. రంగబలి ఫేమ్ యుక్తి తరేజ హీరోయిన్గా నటించింది. రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు.

అయితే.. ఇప్పటివరకు దీపావళి సందర్భంగా రిలీజైన 3 మూవీస్కి యావరేజ్ అండ్ మిక్స్‌డ్ టాక్ వచ్చాయి. ఈ క్రమంలో చివరగా ‘K-Ramp’ రావడంతో మూవీపై ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా యూత్కి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ వచ్చి హైప్ ఇచ్చాయి. మరి సినిమా రిలీజ్ అయ్యాక కూడా, అలాంటి క్రేజీ సెలబ్రేషన్ తీసుకొచ్చిందా? గతేడాది దీపావళికి హిట్ కొట్టిన కిరణ్.. ఈ సారి ఎలాంటి రిజల్ట్ అందుకోనున్నాడు? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.   

కథేంటంటే:

కుమార్ (కిరణ్ అబ్బవరం) ఒక రిచెస్ట్ చిల్లర గాయ్. తల్లి లేదని తండ్రి (సాయికుమార్) చేసిన అతి గారాబంతో ఆవారాగా పెరుగుతాడు. మార్పు కోసం  కేరళ కాలేజ్ లో చేర్పిస్తారు. అక్కడ ఓ రోజు తాగి పడిపోయిన తనను కాపాడింది అని క్లాస్ మెట్ మెర్సీ (యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. కానీ ఆ తర్వాత ఆమెకు ఉన్న స్ట్రెస్ డిజార్డర్ గురించి తెలుస్తుంది. తనకు ఎవరైనా ఓ ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేస్తే .. స్ట్రెస్తో సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి తనను తాను గాయపరచుకుని సూసైడ్కు ప్రయత్నిస్తుంది. ఒక్క క్షణం కరెక్ట్గా ఉండలేని కుమార్.. ఒక్క క్షణం అలసమైనా తట్టుకోలేని మెర్సీకి ఎలా సెట్ అయింది అనేది మిగతా కథ.

ఎలా ఉందంటే:

టాలీవుడ్లో ఎవ్వరికీ తెలియని స్పెషల్ డిజార్డర్స్తో చాలా సినిమాలు వస్తున్నాయి. మారుతి తెరకెక్కించిన "మహానుభావుడు"లో శర్వానంద్ పోషించిన ప్రధాన పాత్ర 'అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్' (OCD) తో బాధపడుతుంటాడు. ఆ తర్వాత మంగళవారం మూవీలో పాయల్ రాజ్ పుత్ (హైపర్ సెక్సువల్ డిజార్డర్‌తో బాధపడుతోంది). మొన్నటికి మొన్న వచ్చిన మదరాసి మూవీలో కూడా ఓ సమస్య ప్రస్తావించారు మురుగదాస్. ఇందులో శివ కార్తికేయన్.. ఫ్రెగోలి భ్రమతో బ్రతుకుతుంటాడు.

ఇలా ఈ ‘కె ర్యాంప్’లో కూడా హీరోయిన్కి ఓ సీరియస్ మానసిక రుగ్మతని తీసుకుని, దాని చుట్టూ కామెడీ లవ్‌స్టోరీగా తెరకెక్కించారు. ఈ క్రమంలో ఆడియన్స్ ఎంటర్టైన్ అయ్యేలా కామెడీని దట్టించి సినిమాను మలిచాడు డైరెక్టర్ జైన్స్ నాని. అయితే.. కథ పరంగా చూసుకుంటే.. పెద్దగా కొత్తదనం కనిపించదు. కేవలం సమస్యని చర్చించిన విధానం, హీరోయిన్ మానసిక రుగ్మతతో బాధపడే తీరు, హీరో పేస్ చేసే ఇబ్బందులు.. అందులో వచ్చే సెంటిమెంట్స్ సినిమాకు ప్రధాన అంశాలు. 

ఫస్టాఫ్ చూసుకుంటే.. కిరణ్ ఎంట్రీ బాగుంది. ఎంసెట్లో ఫెయిల్ అయిన కుమార్.. వాళ్ళ నాన్న బాగా రిచ్ అవ్వడంతో కొడుకుని కేరళలో డబ్బు పెట్టి సీట్ కొని జాయిన్ చేయించిన విధానంలో.. వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. అక్కడ కాలేజీలో హీరోయిన్ని చూసి ఇష్టపడ్డ హీరో.. ఆ తర్వాత కొన్ని వచ్చే కామెడీ సీన్స్.. అక్కడక్కాడా యాక్షన్ అండ్ రొమాన్స్తో ఫస్టాఫ్ డీసెంట్ టైం పాస్ ఇస్తుంది. ఇంటర్వెల్ టైం వచ్చేసరికి హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉందని తెలియడం, అలా ఆ సందర్భంలో వచ్చే కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ ఫస్టాఫ్కి బలంగా నిలుస్తాయి.

ఇక సెకండాఫ్లో కిరణ్ అబ్బవరం, తన తండ్రి సాయి కుమార్ల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ మెప్పిస్తాయి. అయితే, చాలా చోట్ల డబుల్ మీనింగ్స్ పంచులు ఉండటం కొంత ఇబ్బంది కలిగేలా చేస్తాయి. ఏదేమైనప్పటికీ.. ఓ సీరియస్ మానసిక రుగ్మతని తీసుకుని, దాని చుట్టూ కామెడీ లవ్‌స్టోరీగా మలచడంలో డైరెక్టర్ జైన్స్ నాని బాగానే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. 

ఎవరెలా నటించారంటే:

కిరణ్ యాక్టింగ్ సూపర్బ్. కుమార్ పాత్రలో మంచి ర్యాంపేజ్ చూపించాడు. చాలా చోట్ల సింగిల్ లైన్ పంచులు కామెడీ అండ్ యాక్షన్ పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. చిత్తూరు యాసలో చెప్పే డైలాగులకు యూత్‌లో విజిల్స్ పడేలా చేస్తాయి. హీరోయిన్ యుక్తి తరేజా తన పాత్రకు న్యాయం చేసింది. తన గ్లామర్‌తో యూత్‌కి నచ్చేసింది. హీరోకి తండ్రిగా నటించిన సాయి కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. కామెడీ, అండ్ ఎమోషనల్ సీన్స్ తో మెప్పిస్తారు. నరేష్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తమ పాత్రలతో ఆద్యంతం నవ్వించి మెస్మరైజ్ చేస్తారు. 

సాంకేతిక అంశాలు: 

మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కెమెరామెన్ సతీశ్ రెడ్డి కేరళ అందాలను తెరపై మరింత అందంగా చూపించారు. ప్రతి షాట్ అందంగా చిత్రీకరించారు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్‌ ఒకే. సెకండాఫ్‌లో కత్తెరకి ఇంకాస్త పని చెప్పాల్సింది. చివరగా రైటర్, డైరెక్టర్ జైన్స్ నాని.. ఒక సెన్సిటివ్ ఇస్యూని డిస్కస్ చేస్తూనే, కామెడీతో అలరించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, కథపై ఇంకాస్తా పెన్నుకీ పదునుపెట్టాల్సింది.