
రాష్ట్ర ప్రజలందరికీ, సింగరేణి కార్మికులకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో దీపావళి వేడుకలు జరుపుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లాలో మాట్లాడిన ఆయన.. సింగరేణి కార్మికుల ఖాతాల్లోకి ఇవాళ దీపావళి బోనస్ వేశామని చెప్పారు. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల దీపావళి బోనస్ ప్రకటించిందని.. ఒక్కో కార్మికుడికి లక్షా మూడు వేల రూపాయలు అకౌంట్లో జమ చేశామని తెలిపారు. దీపావళి బోనస్ ను సింగరేణి కార్మికులు అందరూ మంచి పనులకు వినియోగించుకోవాలని సూచించారు మంత్రి వివేక్. సింగరేణి కార్మికులు కష్టపడి ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నారని కొనియాడారు.
1995 లో సింగరేణి సంస్థ నష్టాల్లో (BIFR)ఉన్నపుడు కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పించి సింగరేణిలో లక్ష కుటుంబాలను కాపాడారని చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడుకోవాలి కొత్త గనులు తీసుకొచ్చి ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలన్నారు వివేక్. అప్పుడే సింగరేణి సంస్థ తెలంగాణలోనే బెస్ట్ కోల్ ఇండస్ట్రీ గా నిలుస్తుందన్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
అంతకుముందు మంచిర్యాల జిల్లా మందమర్రిలో బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా జరిగిన బంద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్చేసినా.. కేంద్రం అడ్డుకుంటుందన్నారు మంత్రి వివేక్. కాంగ్రెస్ తోనే బీజీలకు న్యాయం జరుగుతుందన్న మంత్రి.. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు