
తిరుమలలో దర్శనం.. వసతి సౌకర్యం కలుగజేస్తామని... తిరుమల పవిత్రతను, భద్రతకు ప్రతిష్ట కలిగేలా కొందరు దళారులు వ్యవహరిస్తున్నారని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు. అందరం కలిసి తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన భాద్యత ఉందన్నారు.
కలియుగ దైవం శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోసం దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శనివారం ( అక్టోబర్ 18) భక్తులకు విజ్ఞప్తి చేశారు. కొందరు దళారులు, మధ్యవర్తులు శ్రీవారి దర్శనం పేరుతో భక్తులను పలు మార్గాల ద్వారా మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ముఖ్యంగా టీటీడీ లోను, ప్రభావిత స్థానాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులమని మాయమాటలతో శ్రీవారి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కల్పిస్తామని ప్రలోభ పెడుతున్నట్లు భక్తుల ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. నకిలీ వ్యక్తులు భక్తుల నుండి భారీ మొత్తాలు వసూలు చేసి మోసం చేస్తున్నట్లు అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే భక్తులను మోసం చేస్తున్న దళారులను టిటిడి గుర్తించి సదరు దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భక్తులందరూ శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి లాంటి టిటిడి సేవలకు సంబంధించి https://ttdevasthanams.ap.gov.in , ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డు ఆధారంగా బుక్ చేసుకోవాలని కోరారు. టిటిడి సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించాలన్నారు. దళారులపై అనుమానం వస్తే టిటిడి విజిలెన్స్ అధికారులు 0877-2263828 సదరు ఫోన్ నెంబర్ లో నిరంతరం అందుబాటులో ఉంటారని, ఫిర్యాదు చేయాలని సూచించారు.