పట్టణాభివృద్ధికి ఏ రాష్ట్రం కూడా తమ లెక్క నిధులు కేటాయించలేదని కేటీఆర్ కామెంట్

పట్టణాభివృద్ధికి ఏ రాష్ట్రం కూడా తమ లెక్క నిధులు కేటాయించలేదని కేటీఆర్ కామెంట్
  • అది ప్రభుత్వానికి చెడ్డపేరు కదా..
  • డ్రాఫ్ట్‌‌ స్టేజీలోనే ఉందని చెప్పలేకపోయారా?
  • మున్సిపల్​ అధికారులతో మంత్రి కేటీఆర్‌‌
  • ప్రతి పట్టణానికి ప్లాన్‌‌ తయారు చేయాలని ఆదేశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కామారెడ్డి మున్సిపల్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌తో రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తనకు తెలియనట్టుగా మంత్రి కేటీఆర్‌‌‌‌ మాట్లాడారు. ఎంసీఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్డీలో గురువారం అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు(లోకల్‌‌‌‌ బాడీస్‌‌‌‌), మున్సిపల్‌‌‌‌ కమిషనర్లతో నిర్వహించిన వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో ఆయన ప్రసంగించారు.

 ‘‘ఈ గవర్నమెంట్‌‌ ఎవరినో ఇబ్బంది పెట్టడానికో, ఇంకోదానికో మనం లేం.. మాస్టర్‌‌ ప్లాన్లు అర్థవంతంగా ప్రజలకు అనుకూలంగా ఉండాలె తప్ప అననుకూలంగా, ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలని నేనెప్పుడు చెప్పలేదు.. ఎక్కడైనా ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే అవన్నీ క్రోడీకరించి డీటీసీపీతో మాట్లాడండి, డీఎంఏతో మాట్లాడండి.. మార్పులు చేర్పులు ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి చేయడానికి ప్రాసెస్‌‌ ఉంది.. దాన్ని ఫాలో అవ్వండి.. ఎక్కడైనా లోకల్‌‌ పబ్లిక్‌‌ వచ్చి రిప్రంజంటేషన్స్‌‌ ఇస్తే వాటిని సమగ్రంగా సమీక్షించండి..ఎవరు ఒత్తిడి చేసినా పట్టించుకోవద్దు.. అల్టిమేట్‌‌గా ఏది కరెక్ట్‌‌ అయితే అదే చేద్దాం..’’ అని అధికారులతో చెప్పారు. 

పట్టణాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

హైదరాబాద్‌‌ మినహా మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి 8 ఏండ్లలో రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్​ అన్నారు. అన్ని పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా నిబద్ధతో పనిచేస్తున్నాని తెలిపారు. దేశంలోని ఇంకే రాష్ట్రం పట్టణాల అభివృద్ధికి ఇంత స్థాయిలో నిధులు కేటాయించలేదని ఆయన అన్నారు. పరిపాలన సంస్కరణలు, కొత్త చట్టాలు, నిరంతరం నిధుల విడుదలతో పట్టణాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. తమపై రాజకీయ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కచ్చితంగా గుర్తించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం నిర్వహించే సర్వేల్లో, అవార్డుల్లో నిరూపితమవతున్నదని చెప్పారు. తెలంగాణలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే ఇతర రాష్ట్రాలను ఒకసారి చూసి రావాలని ఆయన అన్నారు. రాష్ట్ర మున్సిపల్‌‌ శాఖను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగులంతా కలిసి రావాలని ఆయన సూచించారు. 

డిపార్ట్ మెంట్​లో  ఉద్యోగాల భర్తీ త్వరలోనే పూర్తవుతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వార్డు ఆఫీసర్లను నియమిస్తున్నామని తెలిపారు. టీఎస్‌‌ బీపాస్‌‌పై ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌‌ బ్యాక్‌‌ను అడిషనల్‌‌ కలెక్టర్లు సమీక్షించాలన్నారు. హైదరాబాద్‌‌ మినహా మిగతా మున్సిపాలిటీల్లో బీపాస్‌‌ ద్వారా 1.78 లక్షల అప్లికేషన్లకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ప్రతి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, వైకుంఠధామాలు, అధునాతన ధోబీ ఘాట్లు సహా ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్‌‌ తయారు చేయాలన్నారు. 144 మున్సిపాలిటీల్లో 42 ఓడీఎఫ్‌‌ ప్లస్‌‌ సాధించడం అద్భుతమైన విషయమని చెప్పారు. ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించి, ఉత్తమ పనితీరు కనబరిచిన మున్సిపాలిటీలకు కేటగిరీల వారీగా అవార్డు్లిస్తామని కేటీఆర్​ అన్నారు. 

పిల్లల భవిష్యత్తు ఏం గావాలె?

నాకు దేవునిపల్లి శివారులో ఎకరం భూమి ఉంది. ఇల్లు కూడా లేదు. కిరాయి ఇంట్ల ఉంటున్న. ఇద్దరు పిల్లలు.  వ్యవసాయం, కూలీ పనులు చేస్కుంటూ బతుకుతున్నం.  నా పిల్లల భవిష్యతుకు ఎకరం భూమి ఉంది కదా అని అనుకుంటే.. ఉన్న ఈ ఎకరం భూమిలో నుంచి  100 ఫీట్ల రోడ్లు తీస్తమని ప్లాన్​లో చూపెట్టిన్రు. ఎకరం భూమిలో నుంచి సగం భూమి పోతే.. మేమెట్ల బతుకుతం. నా పిల్లల భవిష్యత్తు ఏం గావాలె?  – రామిడిపేట శ్రీనివాస్​, లింగాపూర్​

కామారెడ్డిలో ఒక 500 ఎకరాలు ఏదో ఇండస్ట్రియల్‌‌‌‌ జోన్‌‌‌‌లో పడ్డాయి. అక్కడేదో కొంత మంది ప్రొటెస్ట్‌‌‌‌ చేస్తున్నరు. ఎందుకు ప్రజలను సెన్సిటైజ్‌‌‌‌ చేస్తున్నరు. అది డ్రాఫ్ట్‌‌‌‌ స్టేజీలోనే ఉందని, దానిలో మార్పులు చేర్పులు ఉంటాయని వాళ్లకు ఎందుకు చెప్పలేక పోతున్నరు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు ఏమనుకుంటారు? ప్రభుత్వమేదో తమకు అన్యాయం చేస్తుందనుకుంటారు. దానివల్ల ఎవరో చచ్చిపోయారంట.. మనకు చెడ్డపేరు కదా.  - మంత్రి కేటీఆర్​