కోడ్​ వచ్చేలోపే పంట బోనస్​పై జీవో ఇవ్వు: కేటీఆర్​

కోడ్​ వచ్చేలోపే పంట బోనస్​పై జీవో ఇవ్వు: కేటీఆర్​

సీఎం రేవంత్​రెడ్డికి  కేటీఆర్​ సవాల్​
    ఎండిపోయిన పంటలకు  ఎకరాకు 10 వేలు ఇవ్వాలి 
    మొన్నటి కామారెడ్డి ఫలితం చేదు అనుభవాన్ని మిగిల్చింది
    పార్లమెంట్​ ఎన్నికల నుంచే జైత్రయాత్ర మొదలుపెడ్తం

కామారెడ్డి/రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రభుత్వానికి, సీఎం రేవంత్​రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్​కోడ్​వచ్చే లోపు పంటకు రూ.500 బోనస్ ​ఇస్తూ జీవో జారీ చేయాలని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​ డిమాండ్​ చేశారు. నీళ్లు లేక ఎండుతున్న పంటలకు ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని,  రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్​ కార్యకర్తల విస్తృత స్థాయి మీటింగ్​ కు  ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్రంలో వానకాలంలో సాధారణం కన్నా  14 శాతం అధిక వర్షపాతం నమోదైందని, ఇది  కాలం తెచ్చిన కరువు కాదని, కేసీఆర్​ మీద కోపంతో కాంగ్రెస్​ పార్టీ తెచ్చిన కరువు అని ఆరోపించారు. ఈ ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నదని అన్నారు. మార్చి 17 నాటికి కాంగ్రెస్​ సర్కారు గద్దెనెక్కి 100 రోజులు పూర్తవుతాయని,  ఆ తర్వాత ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్​​ హామీలను వివరించాలని సూచించారు. వంద‌‌‌‌‌‌రోజుల తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఆడ బిడ్డలే బొందపెడతారని అన్నారు.  మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉన్నాయని,  ఇందులో రెండో, మూడో పిల్లర్లకు సమస్య వచ్చి..  కుంగిన మాట వాస్తవమేనని,  బ్యారేజీ మొత్తం కొట్టుకుపోలేదని తెలిపారు. రేవంత్​కు చిత్తశుద్ధి ఉంటే పిల్లర్లకు రిపేర్​ చేయించి  పంటలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

మా అయ్య  కేసీఆరే  

‘మా అయ్య పేరు కేసీఆర్​..  బరాబర్​ వచ్చిన..  ఉద్యమంల కెళ్లి వచ్చిన .. ఐదుసార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచిన’ అని సీఎం రేవంత్​రెడ్డి కామెంట్లపై కేటీఆర్ స్పందించారు. తాను రేవంత్​రెడ్డిలాగా దొంగ పనులు చేసి రాలేదని ధ్వజమెత్తారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా ఉద్యమంలో పాల్గొన్నట్టు చెప్పారు. రాహుల్​ గాంధీ తల్లి, తండ్రి పేరు చెప్పుకుని రాలేదా? అని ప్రశ్నించారు. రేవంత్​ పక్కన ఉన్న శ్రీధర్​బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, భట్టి  విక్రమార్క తండ్రులు, అన్నల పేరు చెప్పుకుని వచ్చారని, వాళ్లను చుట్టూపెట్టుకొని తనని ప్రశ్నించడం గొంగట్లో వెంట్రుకలు ఏరుకున్నట్టే అని దుయ్యబట్టారు. మెడల పేగులేసుకునుడు.. లాగుల తొండలు ఇడుసుడు లాంటి దిక్కుమాలిన డైలాగులు మాని ఇప్పటికైనా  రేవంత్​రెడ్డి సీఎం లాగా మాట్లాడాలని హితవు పలికారు.  కేసీఆర్​పై విమర్శలు మానుకోవాలని సూచించారు. 

పార్లమెంట్​ ఎన్నికల నుంచే జైతయాత్ర 

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి ఫలితం  చేదు అనుభవాన్ని మిగిల్చిందని కేటీఆర్​ పేర్కొన్నారు.  జరిగిందంతా మర్చిపోయి  ముందుకెళ్లాలని  పార్టీ శ్రేణులకు సూచించారు.  పార్లమెంట్​ ఎన్నికల నుంచే జైత్ర యాత్ర మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు.  కామారెడ్డిలో  భారీమెజార్టీ తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ  పని చేయాలని కోరారు.  కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్​ ఓటమికి  తాను క్షమాపణ కోరుతున్నానని మాజీ విప్​ గంప గోవర్ధన్​ అన్నారు. 

ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్​

పార్లమెంట్ ఎన్నికల తర్వాత   రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి సీఎం రేవంత్ రెడ్డి   బీజేపీలోకి జంప్ అవుతారని కేటీఆర్ అన్నారు. రేవంత్ వ్యవహారం చూస్తుంటే మళ్లీ మోదీ పీఎం కావాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో  కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఒక  సిద్ధాంతం అంటూ లేదని మండిపడ్డారు.  గుజరాత్​లో అభివృద్ధే జరగలేదని రాహుల్​గాంధీ అంటుంటే.. గుజరాత్ తమకు మోడల్​ స్టేట్​ అని రేవంత్​ అనడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.  ఐదేండ్లు కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్​ చేసింది గుండు సున్నా అని కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్​ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.