ఫైరింజన్లు నీళ్లు లేకుండా వచ్చినయ్ : కేటీఆర్​

ఫైరింజన్లు నీళ్లు లేకుండా వచ్చినయ్ : కేటీఆర్​
  • అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులూ లేవు: కేటీఆర్​
  • ఒక్కో బాధితుడికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
  • గుల్జార్​ హౌస్ అగ్ని ప్రమాద స్థలం పరిశీలన

హైదరాబాద్, వెలుగు: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైనదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫైరింజన్లు నీళ్లు లేకుండా వచ్చాయని, ఫైర్ సిబ్బందికి సరైన మాస్క్​లు లేకపోవడంతో లోపలికి వెళ్లలేకపోయారని ఆరోపించారు. అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడం దారుణమన్నారు. ఫైరింజన్లు, అంబులెన్సుల్లో ఈ కనీస సదుపాయాలు ఉండి ఉంటే.. మరికొన్ని ప్రాణాలు నిలిచి ఉండేవని బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారన్నారు. 

పాతబస్తీలోని గుల్జార్​హౌస్ అగ్ని ప్రమాద స్థలాన్ని సోమవారం కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబ సభ్యులు ఎవరినీ నిందించడం లేదు. కొన్ని విషయాలు మాత్రం చెప్పారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు వచ్చి కాపాడారని అన్నారు. తమకు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకూడదని కోరారు. సీఎం రేవంత్ దగ్గరే హోం, మున్సిపల్​ శాఖలు ఉన్నాయి. ఘటనా స్థలానికి సీఎం రేవంత్ వచ్చి ఉంటే బాగుండేది. 

అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ.. ఇలాంటి వాటిపై కూడా పెట్టాలి. అందాల పోటీలపై పెట్టే ఖర్చును ప్రమాదాలు జరిగినప్పుడు ఉండాల్సిన మౌలిక సదుపాయాల కల్పనపై చేయాలి. రూ.5 లక్షల నష్టపరిహారం సరిపోదు. ఇల్లు, వ్యాపారాలకు నష్టం జరిగింది. ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. 125 ఏండ్ల నుంచి హైదరాబాద్​లో నివసిస్తున్న అగర్వాల్ కుటుంబం తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించుకునేలా ప్రభుత్వం సహకరించాలి. బీఆర్ఎస్ తరఫున సాయం చేస్తాం’’అని కేటీఆర్ అన్నారు.

నేను రాజకీయం చేయడానికి రాలేదు..

తాను రాజకీయం చేయడానికి ప్రమాద స్థలానికి రాలేదని కేటీఆర్ అన్నారు. ‘‘ఎవరినీ నేను విమర్శించడం లేదు. ఎండాకాలంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాతబస్తీ ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజన్లు, అంబులెన్సులు రావడానికి కూడా వీలుకాలేదు. మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుండాలి. ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’’అని కేటీఆర్ అన్నారు.