ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ .. ‘సిగాచి’ మృతదేహాల తరలింపుపై ఫేక్ ప్రచారం చేస్తున్నడు: మంత్రి వివేక్

ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్  .. ‘సిగాచి’ మృతదేహాల తరలింపుపై ఫేక్ ప్రచారం చేస్తున్నడు: మంత్రి వివేక్

 

  • డెడ్​బాడీలను అట్టపెట్టల్లో తరలిస్తున్నారనడం పచ్చి అబద్ధం
  • అవి డీఎన్ఏ పరీక్షల కోసం సేకరించిన శాంపిల్స్​
  • డెడ్‌‌‌‌బాడీలను ఫ్రీజర్లలో భద్రపరిచి, ప్రత్యేక అంబులెన్సు​ల్లో స్వస్థలాలకు తరలిస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సిగాచి ఫ్యాక్టరీ పేలుడు మృతదేహాల తరలింపుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫేక్​ ప్రచారం  చేస్తున్నారని రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి వివేక్ ​వెంకటస్వామి విమర్శించారు. డీఎన్ఏ పరీక్షల కోసం సేకరించిన శాంపిల్స్​ను బాక్స్​ల్లో ప్యాక్​ చేసి తరలిస్తుంటే.. ఆయన మృతదేహాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

‘‘ఘటనా స్థలంలో లభిస్తున్న మృతదేహాలు, శరీర భాగాల నుంచి శాంపిల్స్  సేకరించి, హైదరాబాద్‌‌‌‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపిస్తున్నాం.. ఈ శాంపిల్స్ తో డీఎన్‌‌‌‌ఏ పరీక్షలు నిర్వహించి, కుటుంబ సభ్యుల డీఎన్‌‌‌‌ఏతో పోల్చి చూస్తున్నాం. మ్యాచ్ అయిన డెడ్​బాడీలను ఫ్రీర్లలో భద్రపరిచి, ప్రత్యేక అంబులెన్స్ లలో వారి స్వస్థలాలకు తరలిస్తున్నాం’’  అని స్పష్టం చేశారు.

 శుక్రవారం జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం  ప్రకటించడమే కాకుండా.. దహన సంస్కారాల కోసం ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందజేసి, పోలీస్​ ఎస్కార్ట్​ను తోడిచ్చి మరీ  పంపుతున్నామని చెప్పారు.  ఇప్పటి వరకు 34  డెడ్​బాడీలను వివిధ రాష్ట్రాల్లోని మృతుల స్వస్థలాలకు తరలించామన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే కేటీఆర్​ మాత్రం మృతదేహాలను అట్టపెట్టల్లో పెట్టి స్వస్థలాలకు తరలిస్తున్నారనడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. 

కేటీఆర్​ వ్యాఖ్యలు హాస్యాస్పదం

సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎం, మంత్రులు స్పందించలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని  మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రమాదం జరిగిన 20 నిమిషాల్లోనే కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లారని, గంటలో తాను, మంత్రి  దామోదర వెళ్లి గాయపడ్డ వారిని హాస్పిటల్ లో జాయిన్ చేయించామని చెప్పారు. 

 గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో జగిత్యాల జిల్లా కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి 64 మంది చనిపోతే.. వారి కుటుంబ సభ్యులను అప్పటి సీఎం కేసీఆర్ కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. సిగాచి ప్రమాదం జరిగిన తర్వాత 24 గంటలు గడవకముందే  సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమకు వచ్చారని, మృతులకు రూ.కోటి పరిహారం ప్రకటించారన్నారు. హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారని గుర్తు చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై కేటీఆర్ చూపిస్తున్న ఫ్రస్టేషన్..​ కేసీఆర్ మీద చూపించాలని అన్నారు.

 ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సాయం చేయడానికి ముందుకు రావాలి గానీ, రాజకీయ విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. ఈ పద్ధతి మానుకోవాలని కేటీఆర్​కు హితవు పలికారు. కాగా, గతేడాది చివరలో లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులు సిగాచి కంపెనీని తనిఖీ చేశారని, భద్రతా చర్యలపై కంపెనీ యజమాన్యానికి పలు సలహాలు సూచనలు చేశారని మంత్రి వివేక్​ వెల్లడించారు. 

అవి మృతదేహాలు కావు.. డీఎన్ఏ శాంపిల్స్: వైద్య, ఆరోగ్యశాఖ

సిగాచి ఇండస్ట్రీస్ లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని  వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ఈ ఘటనలో ఫోరెన్సిక్ పరీక్షల కోసం సేకరించిన శాంపిల్స్​ను ప్యాక్ చేసిన బాక్సులను కొందరు మృతదేహాలుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని, అవి కేవలం డీఎన్‌‌‌‌ఏ పరీక్షల కోసం సేకరించిన నమూనాలని స్పష్టం చేసింది. 

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఘటనా స్థలంలో లభ్యమైన మృతదేహాలు, శరీర భాగాల నుంచి శాంపిల్స్​ను సేకరించి, హైదరాబాద్‌‌‌‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపిస్తున్నామని తెలిపింది. ఈ శాంపిల్స్​తో డీఎన్‌‌‌‌ఏ పరీక్షలు నిర్వహించి, కుటుంబ సభ్యుల డీఎన్‌‌‌‌ఏతో సరిపోలుస్తున్నామని పేర్కొన్నది. 

మ్యాచ్ అయిన మృతదేహాలను ఫ్రీజర్​లో భద్రపరిచి, కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని తెలిపింది. అలాగే, డెడ్​బాడీలను అంబులెన్స్‌‌‌‌ల ద్వారా వందల కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామాలకు తరలిస్తున్నామని, దహన సంస్కారాలు ఇతర అవసరాల కోసం మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం కింద రూ. లక్ష అందిస్తున్నట్లు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించింది.