బిల్డర్లను బెదిరించి.. ఢిల్లీకి రూ.2వేల కోట్లు కప్పం కట్టిండు: కేటీఆర్

బిల్డర్లను బెదిరించి.. ఢిల్లీకి రూ.2వేల కోట్లు కప్పం కట్టిండు: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బిల్డర్లను బెదిరించి పార్లమెంట్ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి రూ. 2,500 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టాడని ఆరోపించారు. ఇవి బయటకు రాకుండా ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కాం అని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు - కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి.. నీకు ఎవ్వడు భయపడడు.. నువ్వు వెంట్రుక కూడా పీకలేవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చెయ్యి.. తప్పు చేసిన వాళ్ళపై చర్య తీసుకో భయపడేది లేదన్నారు. 

తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో వున్న బీజేపీ పగపట్టి కవితను అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతున్నాడని..  పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డేనని విమర్శించారు. పేగులు మెడలో వేసుకునేది ఏంది రా హౌలా.. నువ్వు ముఖ్యమంత్రివా?.. 
బోటీ కొట్టేటోడివా? అంటూ ఆయన ఫైరయ్యారు.

కవితను అరెస్ట్ చేయకుంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ వాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేశారని.. ఈ రోజు బీజేపీ వాళ్లు అక్రమంగా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో చూడాలన్నారు కేటీఆర్.  కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు దిక్కు లేదని.. వీటిని కవర్  చేసుకునేందుకు ఫోన్  ట్యాపింగ్ లు అంటూ తెరమీదికి తెస్తున్నారని మండిపడ్డారు. పంటలు ఎండిపోతుంటే రైతులను పట్టించుకోవడం లేదు కాని.. ఇతర పార్టీల నేతలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నాడని కేటీఆర్, రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

గెలిపించిన ప్రజలకు దానం నాగేందర్ వెన్నుపోటు పొడిచారన్నారు కేటీఆర్. లోక్ సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కు  ఓటమి తప్పదన్నారు. నాగేందర్ పై అనర్హత వేటు వేసేదాకా ఊరుకోమని.. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామన్నారు. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుదన్నారు కేటీఆర్