కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు కేటీఆర్.. కవిత వ్యాఖ్యలే హాట్ టాపిక్ !

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు కేటీఆర్.. కవిత వ్యాఖ్యలే హాట్ టాపిక్ !

ఎర్రవల్లి: సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్లో కీలక పరిణామం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్కు కేటీఆర్ వెళ్లారు. తండ్రీకొడుకుల మధ్య కల్వకుంట్ల కవిత గురించి, ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. తదనంతర పరిణామాలపై తీవ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం.

కవిత లేఖ​, శంషాబాద్​ ఎయిర్​పోర్టు వద్ద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు షోకాజ్​ నోటీసులు ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానం యోచిస్తున్నదన్న టాక్​ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్​ కూడా అసంతృప్తితో ఉన్నట్టు సీనియర్లు  చెప్తున్నారు.

పార్టీ లైన్ను మీరి అనవసరమైన వ్యాఖ్యలు చేశారని, క్రమశిక్షణ చర్యలు తప్పకపోవచ్చని కొందరు అంటున్నారు. అదే సమయంలో ఆమెపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే  ఆందోళన కూడా హైకమాండ్కు ఉన్నట్లు మరికొందరు చెప్తున్నారు.

ఈ పరిణామాల మధ్య కేసీఆర్, కేటీఆర్ భేటీ తెలంగాణ రాజకీయ  వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొన్నాళ్ల నుంచి బీఆర్ఎస్​ పార్టీలో కవిత అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. సొంత అజెండా సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

లిక్కర్​స్కామ్లో జైలుకెళ్లొచ్చిన తర్వాత.. ఆమెకు, కేటీఆర్కు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. అప్పట్లో ఆ వార్తలను కొట్టిపారేశారు. కానీ, ఇప్పుడు కవిత లేఖ, వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జైలు నుంచి వచ్చాక కవిత తన ఇంటినే రాజకీయ వేదికగా మార్చారు.

బీసీ రిజర్వేషన్లు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై స్పందించారు. రిజర్వేషన్లపై ధర్నా చౌక్​ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ స్టాండ్​ ఏదైనా ఆమె మాత్రం బీసీలకు రిజర్వేషన్లపై తన గళాన్ని వినిపించారు. పార్టీతో సంబంధం లేకుండా పార్టీకి సమాంతరంగా ఆమె సొంతంగా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భం దొరికినప్పుడల్లా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు.

పార్టీలో ఆమెకు సరైన ప్రాధాన్యం లేకపోవడం వల్లే సొంతంగా కార్యక్రమాలు చేపట్టారన్న అభిప్రాయాలూ బీఆర్​ఎస్​ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కవిత బీఆర్​ఎస్​ నుంచి వేరుపడి కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ గతంలో జోరుగా ఊహాగానాలు వినిపించాయి. తాజా పరిణామాలు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి.