బండారం బయటపడతదని కేటీఆర్​ వాటిని మూసివేయిస్తున్నడు: సంజయ్​

బండారం బయటపడతదని కేటీఆర్​ వాటిని మూసివేయిస్తున్నడు: సంజయ్​
  • లిక్కర్ స్కామ్​లో కవిత పాత్ర లేకుంటే ఫోన్లు ఎందుకు పగులగొట్టింది?.. ఈ కేసులో ఆమెకు జైలు శిక్ష తప్పదు   
  • కేసీఆర్​కు జీ20 మీటింగ్​కు హాజరయ్యే తీరిక లేదా? 
  • పార్లమెంట్​లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు బీజేపీ ఘనతేనని వెల్లడి 

నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకలను వారం పాటు అధికారికంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం మామడ మండలం దిమ్మదుర్తిలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ముందు అక్కడి అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పూలదండ వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే  అంబేద్కరిజాన్ని వాడ వాడలా విస్తరిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని ప్రధాని మోడీ శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన ఘనత కూడా తమ పార్టీ దేననన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం పంచ తీర్థాల పేరుతో అభివృద్ధి చేస్తుందన్నారు. 12 మంది ఎస్సీ ఎంపీలను కేంద్ర మంత్రులను చేసిన  ఘనత కూడా బీజేపీదే అన్నారు. దళితులను గౌరవించి వారికి అండగా నిలిచే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నా రు.  కానీ కేసీఆర్ మాత్రం దళితద్రోహిగా మారాడన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి లకు కూడా హాజరయ్యే తీరకలేదని విమర్శించారు. మోడీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న  జీ 20 సమిట్ ఏర్పాట్ల కోసం నిర్వహించిన సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎంలు, అధికార, ప్రతిపక్ష పార్టీలు, జాతీయ పార్టీల అధ్యక్షులు హాజరైనప్పటికీ కేసీఆర్ డుమ్మా కొట్టడన్నారు.

డ్రగ్స్ కేసులు రీఓపెన్ చేయాలి.. 

ట్విట్టర్ టిల్లుగా మారిన మంత్రి కేటీఆర్ తన బండారం బయటపడుతుందనే భయంతోనే బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను మూసివేయిస్తున్నాడని, వెంటనే ఆ కేసులు రీ ఓపెన్ చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్​లో తన పాత్ర ఏమీలేదంటున్న కవిత 10 ఫోన్లను ఎందుకు ధ్వంసం చేసిందని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కవిత ఇంద్ర భవనం లాంటి ఇల్లు కట్టుకున్నదని, అవినీతిలో అయ్యకు తగ్గ బిడ్డగా గుర్తింపు పొందారని విమర్శించారు. లిక్కర్ దందాలో కవిత జైలుకెళ్లడం ఖాయమన్నారు. ప్రస్తుతం కేసీఆర్ దేశం, రాష్ట్రం గురించి మరిచిపోయి కేవలం తన బిడ్డను కేసుల నుంచి కాపాడే ప్రయత్నంలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఫలితంగా రాష్ట్రంలో పాలన స్తంభించి పోతోందన్నారు. కార్యక్రమంలో యాత్ర కన్వీనర్ మోహన్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, జిల్లా అధ్య క్షురాలు రమాదేవి, సీనియర్ నాయకులు రావుల రామనాథ్, భూమయ్య, అప్పాల గణేశ్ చక్రవర్తి, మెడిసిమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, అంజు కుమార్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున రెడ్డి, సాగర్, శ్రావణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.