కవితతో కేటీఆర్ ములాఖత్

కవితతో కేటీఆర్ ములాఖత్
  • సీబీఐ హెడ్ ఆఫీసులో 20 నిమిషాలు భేటీ
  • ముగిసిన కవిత కస్టడీ 
  • ఇయ్యాల కోర్టులో హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె అన్న కేటీఆర్ ములాఖత్ అయ్యారు. బావ అనిల్, లాయర్ మోహిత్ రావుతో కలిసి ఆదివారం సాయంత్రం 6 గంటలకు సీబీఐ హెడ్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్.. కవితతో దాదాపు 20 నిమిషాలకు పైగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీబీఐ విచారణపై అడిగి తెలుసుకున్నారు. తాము తోడుగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కవితకు భరోసా ఇచ్చారు. అనంతరం భర్త అనిల్ తో కవిత కాసేపు మాట్లాడారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు మార్చి 21న కవితను కలిసిన కేటీఆర్.. తిరిగి 20 రోజుల తర్వాత ఆమెను కలిశారు. కాగా, కవితకు సీబీఐ కస్టడీ ఆదివారంతో ముగిసింది. సోమవారం ఉదయం 10 గంటలకు అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.  

చివరి రోజు సుదీర్ఘ విచారణ..

కస్టడీలో చివరి రోజైన ఆదివారం కవితను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా ఆమె స్టేట్​మెంట్ రికార్డు చేశారు. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర, ఆప్ నేతలతో మీటింగ్స్, సౌత్ గ్రూప్ ద్వారా హవాలా రూపంలో నిధుల మళ్లింపుపై ప్రశ్నించిన్నట్టు తెలిసింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు? ఎవరి ద్వారా ఎంటర్ అయ్యారు? ఇందులో ఎలాంటి లబ్ధి చేకూరింది? అనే అంశాలపై అడిగినట్టు సమాచారం. అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలాలను కవితకు చూపించి అధికారులు విచారించారు. 

‘‘కవితను కలవాలని కేజ్రీవాల్ చెప్పారు. కవితను కలిసిన తర్వాత ఆమె రూ. 50 కోట్లు ఇవ్వాలని కోరారు” అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఇచ్చిన స్టేట్ మెంట్ పై ఆరా తీశారు. ఇందులో భాగంగా శ్రీనివాసులు తన కుమారుడు రాఘవ ద్వారా బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లికి రూ.25 కోట్లు ముట్టజెప్పింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. విజయ్ నాయర్​కు రూ.100 కోట్లు చెల్లించామని, ఇందులో రూ.30 కోట్లు హవాలా రూపంలో మళ్లించామని దినేశ్ అరోరాకు అభిషేక్ చెప్పినట్టు సేకరించిన వాంగ్మూలాలపైనా విచారించారు. 

శరత్ చంద్రారెడ్డి డబ్బులు ఎందుకిచ్చారు? 

లిక్కర్ స్కామ్​తో సంబంధమే లేకపోతే, అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో జరిగిన లావాదేవీల సంగతేంటని కవితను సీబీఐ ప్రశ్నించింది. ‘‘మహబూబ్ నగర్ లోని రూ.14 కోట్ల విలువైన అగ్రికల్చర్ ల్యాండ్ ను కొనుగోలు చేయాలని శరత్ చంద్రారెడ్డిని ఎందుకు బెదిరించారు? శరత్ చంద్రారెడ్డికి చెందిన మహిర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ కొనుగోలు జరిగింది నిజమా? కాదా? తెలంగాణ జాగృతికి సీఎస్ఆర్ రూపంలో శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షలు ఇచ్చింది నిజమా? కాదా?” అని ప్రశ్నల వర్షం కురిపించింది. వీటన్నింటికీ సంబంధించిన ఆధారాలను ముందు పెట్టి విచారించింది. బుచ్చిబాబు మొబైల్ ఫోన్లలో దొరికిన డేటా, అభిషేక్ బోయినపల్లితో పాటు ఢిల్లీలోని తన పీఏ కౌశిక్ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను ప్రశ్నించినట్టు తెలిసింది.

కొన్ని పార్టీలతో రాజ్యాంగానికి ప్రమాదం

    అంబేద్కర్ జయంతి వేడుకల్లో  కేటీఆర్ కామెంట్స్

హైదరాబాద్, వెలుగు: కొన్ని రాజకీయ పార్టీల వైఖరితో  రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ ఆలోచనల ప్రకారం అన్ని వర్గాలు కలిసిమెలిసి ముందుకు పోవాలని సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. " అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనల మేరకే పథకాలను రూపొందించి అమలు చేశాం. సమాజంలో సమానత్వం రావాలి అంటే, రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగాల్సిన అవసరం ఉంది" అని తెలిపారు. కార్యక్రమంలో  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ జయంతికి కేసీఆర్ దూరం

అంబేద్కర్ జయంతి వేడుకలకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. సీఎంగా ఉన్నంత కాలం అంబేద్కర్ జయంతి వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకాలేదని, ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పుడు కూడా వెళ్లకపోవడం ఏమిటని బీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.