ఐకే రెడ్డి అనుచరులకు కేటీఆర్​ ఫోన్​

ఐకే రెడ్డి అనుచరులకు కేటీఆర్​ ఫోన్​
  •     కాంగ్రెస్​లో చేరేందుకు మాజీ మంత్రి ప్రయత్నాలు
  •     భారీగా అనుచరులు వెళ్లే చాన్స్​
  •     పార్టీ ఖాళీ కాకుండా సెకండ్​ క్యాడర్​కు ఫోన్లు 
  •     ఐకేరెడ్డి రాకకు వ్యతిరేకంగా కాంగ్రెస్​తీర్మానాలు

నిర్మల్, వెలుగు:  నిర్మల్​లో  బీఆర్ఎస్​ నేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి త్వరలో కారు దిగి, కాంగ్రెస్​లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్​ ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్​ భారీగా తరలివెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఐకే రెడ్డిని పార్టీ మారకుండా చూసేందుకు బీఆర్ఎస్​ హైకమాండ్​ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మాజీ మంత్రితో పాటు పార్టీ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉండడంతో రెండు, మూడు రోజులుగా బీఆర్ఎస్ ​అగ్ర నేతలు కేటీఆర్, హరీశ్​రావు దిద్దుబాటు చర్యలకు దిగారు. పార్టీలోని సెకండ్​ క్యాడర్​ లీడర్లకు నేరుగా ఫోన్లు చేసి బుజ్జగించే  ప్రయత్నం చేశారు. సోమ, మంగళవారాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు వరుసగా ఫోన్లు వచ్చినట్లు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారవద్దని, కొద్ది రోజులు మాత్రమే సంక్షోభం ఉంటుందని,  వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్​ అధికారం చేపడుతుందని, బీఆర్ఎస్ పవర్​లోకి రాగానే సీనియర్ నేతలందరికీ పదవులపరంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తామని కేటీఆర్​, హరీశ్​రావు  హామీ ఇచ్చినట్లు తెలిసింది.  

ఐకేరెడ్డి రాకకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ ఆందోళన 

ఐకే రెడ్డితో పాటు చాలామంది ప్రజాప్రతినిధులు, సీని యర్ నేతలు కాంగ్రెస్​లో చేరేందుకు వారం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారంతో జిల్లా కాంగ్రెస్​లో కలకలం మొదలైంది. ఆ పార్టీకి చెందిన చాలామంది సీనియర్లతోపాటు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు వర్గీయులు  మూడు రోజులుగా ఐకే రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ మండలాల వారీగా ఆందోళనలు చేపడుతున్నారు. సోమవారం నిర్మల్, మామడ, సారంగాపూర్, మండలాల్లో  ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. మంగళవారం లక్ష్మణచాందలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్​ లీడర్లు ధర్నా చేసి ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఐకే రెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో  చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావుతో పాటు మరికొందరు  సీనియర్ లీడర్లు హైదరాబాద్​లో మకాం వేసి ఐకేరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతుండడం ఆసక్తి రేపుతోంది.