
ఏపీ మంత్రి నారా లోకేష్ ను తాను కలవలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . కలవాల్సిన అవసరం వస్తే అర్థరాత్రి కాదు పట్టపగలే కలుస్తానని చెప్పారు. అయినా లోకేష్ ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు కేటీఆర్. లోకేష్ పక్క రాష్ట్రం మంత్రి , తనకు తమ్ముడి లాంటివాడన్నారు. లోకేష్ చదువుకున్న యువకుడు మంచివాడు, తనతో సత్సంబంధాలున్నాయని చెప్పారు కేటీఆర్..
ఎప్పుడైనా ఏ చర్చకైనా సిద్ధమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్చకు రావాలని సవాల్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి తోకముడిచారని ఫైర్ అయ్యారు. ఏ ఆధారం లేకున్నా డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తమపై టన్నుల కొద్ది కేసులు పెట్టినా గుండుపిండంత ఆధారం దొరికిందా అని ప్రశ్నించారు. ఎంతకాలం ఆ తప్పుడు ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు కేటీఆర్.
దుబాయ్ లో ఎవరో చనిపోతే తనకేం సంబంధమని ప్రశ్నించారు కేటీఆర్. దమ్ముంటే ఆధారాలు చూపించాలన్నారు. కిట్టీ పార్టీ ఆంటీ లాగా.. మాటలు చెప్పవద్దన్నారు. రేవంత్ కు ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదన్నారు. రేవంత్ ను తన కుటుంబ సభ్యులు మానసిక హాస్పిటల్ లో చూపించాలన్నారు కేటీఆర్. తాము తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా మాట్లాడుతున్నామన్నారు. రేవంత్ కు తమపై దొంగ కేసు పెట్టినా..సరిగ్గా పెట్టడం రాలేదన్నారు కేటీఆర్.
మేం అన్నం పెడితే.. రేవంత్ బిర్యానీ పెడతాడని ఆశపడి ఉన్న అన్నం కూడా జనం పోగొట్టుకున్నారని.. ఇప్పుడు ఐదేళ్ల శిక్ష అనుభవిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీని ఓడించి తప్పు చేశామనే బాధలో జనం ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీని గెలిపించటం జనం తప్పేనంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే కేటీఆర్.